నిండా ముంచేసిన ‘పులి’

Update: 2015-10-03 17:30 GMT
ఓ స్టార్ హీరో సినిమాను 50 కోట్లతో నిర్మిస్తే.. అది సూపర్ హిట్టయి 100 కోట్లు వసూలు చేసిందనుకోండి.. అంతమాత్రాన అతడి తర్వాతి సినిమాకు వంద కోట్లు బడ్జెట్ పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ సినిమా తేడా వస్తే ఏమవుతుంది? విజయ్ సినిమా ‘పులి’ విషయంలో ఇలాగే జరిగింది. ఇంతకుముందు విజయ్ నటించిన కత్తి - తుపాకి సినిమాలు వంద కోట్లకు అటు ఇటుగా వసూళ్లు సాధించాయి. ఐతే బడ్జెట్ మాత్రం అందులో సగమే. రెండు సినిమాల్లోనూ మురుగదాస్ ఫ్యాక్టర్ కూడా ఉన్న సంగతి గుర్తుంచుకోవాలి. కానీ మొత్తం క్రెడిట్ విజయ్ దే అన్నట్లు ‘పులి’ సినిమాకు వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే జరిగింది. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.

తక్కువలో తక్కువ అన్ని భాషల్లో కలిపి రూ.30 కోట్ల దాకా బయ్యర్ల మీద భారం పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అన్ని భాషల్లో కలిపి రూ.85 కోట్లు పలికాయి. ఐతే విడుదలకు ముందు రోజు వివాదాల పుణ్యమా అని సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ప్రిమియర్ షోలన్నీ రద్దయ్యాయి. వీక్ డేస్ లో రోజుకు ఐదు షోలకు మించి వేయకూడదన్న ప్రభుత్వ నిబంధనలు ‘పులి’ని దారుణంగా దెబ్బ కొట్టాయి.

తెలుగులో అయితే తొలి రోజు షోలే పడలేదు. భారీగా జరిగిన అడ్వాన్స్ బుక్సింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. రెండో రోజు కూడా సాయంత్రానికే షోలు వేశారు. దీంతో దాదాపు రెండు కోట్ల దాకా ఆదాయానికి గండి పడింది. ఇక అప్పటికే నెగెటివ్ టాక్ వచ్చేయడంతో సినిమాకు ఓపెనింగ్స్ లేవు. తెలుగులో దాదాపు రూ.8 కోట్లకు అమ్మారు సినిమాను. అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. తమిళంలోనూ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు. హిందీ వెర్షన్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మొత్తానికి ‘పులి’ అన్ని భాషల్లో కలిపి బయ్యర్లపై రూ.30 కోట్లకు పైగా భారం మోపేలా కనిపిస్తోంది.
Tags:    

Similar News