పూరి.. తెలంగాణ యాస.. ఓ చరిత్ర

Update: 2019-07-23 01:30 GMT
హిట్  కోసం చకోర పక్షిలా తిరుగుతున్న పూరి జగన్నాథ్ కు ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కాస్తా ఊరట లభించిందనే చెప్పాలి. మాస్ ఆడియెన్స్ ను ఆకర్షించిన ఈ సినిమాపై మిశ్రమ టాక్ వచ్చినా వసూళ్లు వస్తుండడంతో పూరి హ్యాపీగానే ఉన్నారు. నిజానికి టెంపర్ తర్వాత అంతటి హిట్ పూరికి ఇప్పటికీ దొరికింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తి తెలంగాణ యాసతో రూపుదిద్దుకుంది. అయితే అప్పట్లో పూరి తీసిన ‘కెమెరామెన్ గంగ తో రాంబాబు’ సినిమాతో తెలంగాణ యాసను తన సినిమాల్లో ప్రబలంగా పలికించాడు పూరి. ఆ సినిమా తెలంగాణ ఏర్పడకముందు వచ్చింది. అప్పటి ఉద్యమకారుడు కేసీఆర్, ఆయన కూతురు కవితను పోలి ఉండేలా పాత్రలున్నాయని పెద్ద దుమారమే రేగింది. అయితే ఎలాగోలా సినిమా అయితే ఆడింది. తెలంగాణ వాదులు, టీఆర్ ఎస్ నాయకులు పూరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తెలంగాణ వారిని అవమానించారని అప్పట్లో పెద్ద ఆందోళనే చేశారు. మరోసారి మా బాషను అవమానిస్తే బాగుండదని వార్నింగ్ లు ఇచ్చారు.

ఇప్పుడు విశాఖ జిల్లాకు చెందిన ఆంధ్రా పూరికి అదే తెలంగాణ యాస దిక్కవడం విశేషమే మరి.. హీరో రామ్ కూడా తెలంగాణ యాసపై బాగానే కష్టపడ్డాడు. పూరి ఆంధ్రా నేపథ్యమున్నా తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఈలలు కొట్టించాయి.

ఎట్టకేలకే తెలంగాణ యాస, పాత్ర చిత్రణే పూరికి ఆయుధమై వెండితెరపై ఆయనను నిలబెట్టిందనే చర్చ సాగుతోంది. ఆంధ్రా మూలాలున్నా తెలంగాణ డైలాగ్స్ ను బాగా రాసిన పూరిపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాడు పూరిని వ్యతిరేకించిన వారినే ఇప్పుడు పూరి మెప్పించడం విశేషంగా చెప్పవచ్చు.  మాస్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ క్రిటిక్స్ కు మాత్రం నచ్చకపోవడం గమనించదగ్గ విషయం.

    

Tags:    

Similar News