పూరి.. ఏం మారినట్లు?

Update: 2015-11-09 19:30 GMT
తెలుగు సినిమా హీరోలందు పూరి జగన్నాథ్ హీరో వేరు. ఆ లెక్కలేని తనం.. ఆ పొగరు.. ఆ దూకుడు.. ఆ స్టయిలు.. అన్నీ అదో రకం. అందుకే పూరి యూత్, మాస్ ఆడియన్స్ కి ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడు. ఐతే ఒక దశ వరకు బాగానే ఉంది కానీ.. ఎప్పుడూ ఒకే తరహా క్యారెక్టర్.. ఒకే టైపు కథలు వండి వార్చడంతో విసుగొచ్చేసింది జనాలకు. అందుకే వరుసగా అతడి సినిమాల్ని తిప్పికొట్టారు. ఐతే ‘టెంపర్’ సినిమా పూరికి ఓ మేకోవర్ లా అనిపించింది. పూరి తిక్క హీరో క్యారెక్టరైజేషన్ లో కొంతవరకు కనిపించింది కానీ.. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా అనిపించింది. పూరి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు కనిపించింది ఈ సినిమాలో. కానీ ఇప్పుడు మళ్లీ ‘లోఫర్’ చూస్తుంటే పూరి ఏం మారాడన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

వక్కంతం కథ అందించాడు కాబట్టి ‘టెంపర్’ అలా తీశాడు తప్పితే.. పూరి పెన్ను మాత్రం కొత్తగా అంటే మొరాయిస్తున్నట్లే ఉంది. ‘లోఫర్’ చూస్తుంటే పూరి చేసిన పాత సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి తప్పితే.. అందులో ఏ కొత్తదనం కనిపించట్లేదు. ముఖ్యంగా ‘ఏక్ నిరంజన్’ సినిమా గుర్తుకొస్తోంది ‘లోఫర్’ ట్రైలర్ చూస్తుంటే. విలన్ క్యారెక్టర్లు, ఫైట్లు అన్నీ కూడా పూరి ఏం మారలేదు అని రుజువు చేస్తున్నాయి. ట్రైలర్ వరకు ఎగ్జైట్ మెంట్ కలిగిస్తోంది వరుణ్ మాత్రమే. ఇప్పటిదాకా సాఫ్ట్ సినిమాలు చేసిన వరుణ్.. ఈసారి మాస్ వేషం వేస్తుండటంతో ఈ పాత్రను అతనెలా చేస్తాడా అని ఆసక్తి రేపుతోంది. మొత్తానికి ‘లోఫర్’ సినిమాకు సంబంధించి వరుణ్ కొత్త సీసా అనుకుంటే.. పూరి పాత సారా అనుకోవాలి.
Tags:    

Similar News