గోల్డెన్ వీసా అందుకుని డైరెక్టుగా వైజాగ్ కి పుష్ప‌రాజ్

Update: 2023-01-20 04:04 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ లో అరుదైన గౌర‌వాన్ని అందుకున్నారు. ఆకాశ‌హార్మ్యాల‌ దుబాయ్ ప్ర‌భుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసాని మంజూరు చేయ‌డం అరుదైన గౌర‌వం. ఒక క‌థానాయ‌కుడిగా షేక్ ల న‌గ‌రంలో అత‌డికి ఇది ప్ర‌త్యేక గుర్తింపు. భార‌తీయ న‌టుల్లో అరుదుగా కొంద‌రికి మాత్ర‌మే ఇలాంటి గౌర‌వం గుర్తింపు ద‌క్కాయి.

ఈ తీపి క‌బురు చెప్పిన బ‌న్ని ఇంత‌లోనే పుష్ప‌రాజ్ గా ప‌రకాయ ప్ర‌వేశం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. అల్లు అర్జున్- సుకుమార్ ల మోస్ట్ అవైటెడ్ 2023 చిత‌రం 'పుష్ప-2' గ‌త డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లింది. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసారు.

ఇప్పుడు దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న కిక్కులో ఉన్న బ‌న్ని త‌దుప‌రి 'పుష్ప-2' కొత్త షెడ్యూల్ లో పాల్గొనేందుకు బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికి వెళుతున్నారు. శుక్రవారం నుండి వైజాగ్ స‌హా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభం కానుంది. ఈ శుక్ర‌వారం సాయంత్రం అల్లు అర్జున్ తన టీమ్ తో కలిసి వైజాగ్ లో అడుగుపెడ‌తారని తెలిసింది.

దర్శకుడు సుకుమార్ మొదటి భాగం కంటే రెండో భాగాన్ని మరింత భారీ కాన్వాసుతో అసాధార‌ణ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాలనే ఆసక్తితో ఉన్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. పుష్ప-2లో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. పార్ట్ 2 లో పుష్ప‌రాజ్ వ‌ర్సెస్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ ఎపిసోడ్స్ మ‌రో లెవ‌ల్లో ఉంటాయ‌ని అడ‌వుల్లో ఇంటెలెక్చువ‌ల్ గేమ్ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ను ప‌రాకాష్ట‌లో చూపించ‌బోతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  టీమ్ గుస‌గుస‌ల ప్ర‌కారం.. పుష్ప-2 (పుష్ప-ది రూల్) 2024లో  పాన్-ఇండియా కేట‌గిరీలో థియేట్రికల్ విడుదలకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News