పీవీపీ... వ్యూహం మారాల్సిందే గురూ!

Update: 2015-12-03 07:34 GMT
కార్పొరేట్లు సినిమా రంగంపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నారు. వివిధ వ్యాపారాల్లో జ‌య‌కేత‌నం ఎగ‌రేసిన కార్పొరేట్లు సినిమా రంగం ద‌గ్గ‌రికొచ్చేస‌రికి చ‌తికిల ప‌డిపోతున్నారు. ఈ రంగంలో స‌క్సెస్ శాతం ప‌దికి మించి ఉండ‌దు మ‌రి. కానీ తమ వ్యూహాల‌తో ఇక్క‌డ కూడా అద‌ర‌గొట్టేద్దాం అని వ‌చ్చేస్తుంటారు. కానీ వాళ్లు అనుకొన్న‌ట్టు  ఇక్క‌డ ఏమీ జ‌ర‌గ‌డం లేదు. దీంతో చేతులు కాల్చుకోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. అయినా స‌రే...  భారీ లాభాల‌కి సినిమా రంగంలో ఆస్కారం ఉండ‌టంతో తొలి అడుగుల్లో ఎదురు దెబ్బ‌లు తిన్నా వేచి చూసే ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు కార్పొరేట్లు. ప్ర‌స్తుతం పీవీపీ ప‌రిస్థితి అదే.

పీవీపీ సంస్థ కొన్నాళ్ల‌క్రితమే ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు - త‌మిళం - హిందీ భాష‌ల్లో పెద్ద‌యెత్తున సినిమాలు తీసేందుకు కొన్ని పెట్టుబ‌డులు కేటాయించింది. అయితే ద‌క్షిణాదిలో ఆ సంస్థ‌కి  ఇటీవ‌ల ఎదురు దెబ్బ‌లే త‌గులుతున్నాయి. భారీ పెట్టుబ‌డితో రెండేళ్ల క్రితం తీసిన వ‌ర్ణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఆ సినిమా కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని మిగిల్చింది. ఇటీవ‌ల భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన  సైజ్‌ జీరో సినిమా కూడా చేదు అనుభ‌వాన్ని మిగిల్చేలా క‌నిపిస్తోంది. ద‌ర్శ‌కుడు ఈ సినిమాని ఒక చిన్న సినిమాగా తీయాల‌నుకొన్నా పీవీపీ సంస్థ రెండు భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కింది. కానీ ఫ‌లితం అనుకొన్నంత‌గా రాలేదు. ఈ సినిమాకి పీవీపీకి న‌ష్టాల్నే మిగిల్చింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక ఆ సంస్థ ఆశ‌లు బ్ర‌హ్మోత్స‌వం - ఊపిరి లాంటి సినిమాల‌పైనే. ఆ చిత్రాలు కాస్త అటు ఇటైనా పీవీపీ సంస్థ‌కి ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పీవీపీ క‌థ‌ల విష‌యంలోనూ వ్యూహాలు మార్చాల్సిందే అని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News