‘క్వీన్’ రీమేక్.. ఉన్న తలనొప్పులు చాలవని

Update: 2017-06-10 06:01 GMT
మూడేళ్లుగా ‘క్వీన్’ రీమేక్ గురించి ఎన్ని ముచ్చట్లు విన్నామో. ఇదిగో అదిగో అంటూ రెండేళ్లకు పైగా కాలం గడిపేసిన నిర్మాత త్యాగరాజన్.. చివరికి కొన్ని నెలల కిందట నాలుగు భాషల్లో ‘క్వీన్’ రీమేక్ గురించి ప్రకటన ఇచ్చారు. కానీ ఆ తర్వాత అనేకానేక మార్పులు చోటు చేసుకున్నాయి. తమన్నా తప్పుకోవడంతో తెలుగు-తమిళ భాషల్లో ఈ రీమేక్ ఆగిపోయింది. ఐతే కన్నడలో మాత్రం రమేష్ అరవింద్ దర్శకత్వంలో పారుల్ యాదవ్ కథానాయికగా సినిమా మొదలుపెట్టాడు త్యాగరాజన్. ఇక తెలుగు-తమిళ భాషల కోసం కాజల్ అగర్వాల్ ను.. మలయాళం కోసం అమలా పాల్ ను ఫైనలైజ్ చేసి త్వరలోనే ఆయా వెర్షన్లు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు త్యాగరాజన్.

ఇంతలో ‘క్వీన్’ రీమేక్ కు అనుకోని తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా రీమేక్ హక్కులు తమవంటూ గోల్డెన్‌ క్లబ్‌ ఫిలిమ్స్ అనే లండన్‌ కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్ ఒక ప్రకటన ఇచ్చి అందరినీ విస్మయానికి గురి చేసింది. క్వీన్‌ చిత్ర దక్షిణాది భాషా చిత్రాల హక్కులు తమకు చెందినవని.. తాను స్టార్‌ మూవీస్‌ సంస్థ అధినేత త్యాగరాజన్‌ ను భాగస్వామిగా చేర్చుకున్నామనీ ఆ సంస్థ పేర్కొంది. ‘క్వీన్‌’ సినిమా దక్షిణాది రీమేక్‌ హక్కుల విషయమై తాము బ్రిటీష్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ (బీఎఫ్‌ ఐ)లో రిజిస్టర్‌ కూడా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సినిమా కోసం నటీనటులు.. సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే పనిలోనే ఉండగా.. కన్నడతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోందని తెలిసి తాము షాకయ్యామని ఆ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై త్వరలోనే తదుపరి ప్రకటన చేస్తామని తెలిపింది. మరి ఈ ప్రకటనపై త్యాగరాజన్ ఏమంటాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News