చదువుల రాక్షసి - ట్రైలర్ టాక్

Update: 2019-06-01 10:48 GMT
స్టార్ హీరో సూర్య భార్య కాకముందు సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తెలుగులో చిరంజీవితో మొదలుకుని తమిళ్ లో విజయ్ అజిత్ ల దాకా అందరితోనూ నటించిన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ మహా జోరుగా సాగుతోంది. మనదాకా రావడం లేదు కానీ అక్కడ సోలో పాత్రల్లో చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఆ సిరీస్ లో రాబోతున్న మూవీనే రాక్షసి. దీని ట్రైలర్ విడుదలైంది.

అదో గ్రామం. క్రమశిక్షణ చదువు అనే పదాలకు దూరంగా ఉంటుంది ప్రభుత్వ పాఠశాల. ఏ ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండరు. అస్తవ్యస్తమైన అలాంటి పరిస్థితుల్లో ముక్కుసూటిగా అనుకున్నది చేసుకుంటూ పోయే గీతారాణి(జ్యోతిక)కు అక్కడ పోస్టింగ్ వస్తుంది. మొత్తం ప్రక్షాళన చేసేందుకు నడుం బిగిస్తుంది. దీంతో అప్పటికే అక్కడ పాతుకుపోయిన టీచర్లకు ఇదంతా ప్రాణ సంకటంగా మారుతుంది. శత్రువులు మొదలవుతారు. స్కూల్ వ్యవహారాల్లో రాజకీయ నాయకులూ తలదూరుస్తారు. ప్రాణాలకు తెగించాల్సి వస్తుంది. ఈ పోరాటంలో గీతారాణి ఎలా గెలిచింది అనేదే రాక్షసి కథ

ట్రైలర్ లో కంటెంట్ టైటిల్ కి పూర్తి సార్థకత చేకూర్చింది. అంతగా పేరున్న ఆర్టిస్టులు లేని లోటుని ఒంటి భుజాలపై మోసింది జ్యోతిక. తన పెర్ఫార్మన్స్ తో చెడుగుడు ఆడేసింది. దర్శకుడు గౌతమ్ రాజ్ టేకింగ్ కూడా బాగుంది. గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం సీన్ రోల్దాన్ సంగీతం బాగా ఎలివేట్ అయ్యాయి. అంచనాలు రేపడంలో రాక్షసి సక్సెస్ అయ్యింది.

ప్రొడక్షన్ పరంగా కూడా మంచి క్వాలిటీ కనిపిస్తోంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించిన రాక్షసి అదే టైటిల్ తో తెలుగులోకి డబ్బింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో విడుదల కానున్న ఈ మూవీకి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు



Full View
Tags:    

Similar News