కంటెంట్ లేక‌పోతే స‌ల్మాన్ అయినా సంపూర్ణేష్ బాబు అయినా ఒక‌టే!!

Update: 2021-05-22 03:29 GMT
ఇటీవ‌లి కాలంలో సినిమాల రిలీజ్ విధానం మార్చేందుకు అతి పెద్ద ప్ర‌య‌త్నం చేశారు బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్. తాను న‌టించిన రాధే చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ తో పాటు ఓటీటీలోనూ సైమ‌ల్టేనియ‌స్ గా విడుద‌ల‌ చేశారు. డిజిట‌ల్లో పే-ప‌ర్ వ్యూ విధానాన్ని ప్ర‌వేశ పెట్టారు. సెకండ్ వేవ్ విల‌యం సాగుతున్నా ఈద్ కానుక‌ను విస్మ‌రించ‌ను అంటూ అభిమానుల‌కు హామీ ఇచ్చిన స‌ల్మాన్ భాయ్ అన్నంత ప‌నీ చేశాడు.

అయితే రాధే స‌క్సెసైందా?  బాక్సాఫీస్ రిజ‌ల్ట్ ఎలా ఉంది?  లాభ‌మా ?  న‌ష్ట‌మా? అస‌లు స‌ల్మాన్ ఎంచుకున్న మోడ‌ల్ స‌రైన‌దేనా? అంటూ ట్రేడ్ లో క్రిటిక్స్ లో విశ్లేష‌ణ సాగుతోంది.

నిజానికి రాధే చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ రావ‌డం పెద్ద పంచ్ వేసింద‌న్న‌ది నిర్వివాదాంశం. ఈ సినిమాకి వ‌కీల్ సాబ్ కి వ‌చ్చిన‌ట్టు బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ రాలేదు. ఉప్పెన లాగా సంచ‌ల‌నం అని కూడా టాక్ వినిపించ‌లేదు. క్రిటిక్స్ రంధ్రాన్వేష‌ణ‌ల‌తో పంచ్ లు వేశారు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వాన్ని తిట్టారు. రివ్యూలు చ‌దివే ప్ర‌పంచం రాధేని లైట్ తీస్కుంది. పైగా 250 టికెట్ కి పెట్టి క‌రోనా భ‌యాల న‌డుమ‌ థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ఎవ‌రూ ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు. రిలీజ్ ముందు క్రియేట్ చేసిన హైప్ ఒక్క‌రోజులోనే దిగిపోయేలా రివ్యూవ‌ర్స్ ఈ మూవీని తీవ్రంగా విమ‌ర్శించ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది.

దీనికి తోడు జీ5 - జీప్లెక్స్ విడుదల సమయంలో సర్వర్ ల క్రాష్ కూడా పెద్ద దెబ్బ కొట్టింది. పైగా సినిమా రిలీజైన మొద‌టి రోజే పైర‌సీ లింకులు అందుబాటులోకి రావ‌డం మ‌రో పెద్ద దెబ్బ‌. ఇలాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుండి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద మొత్తాన్ని టికెట్ కి కేటాయించి సినిమా చూడటానికి ఇటీవ‌ల ఎవ‌రూ సిద్ధంగా లేరు. క‌రోనా దెబ్బ‌కు ఆదాయాలు జీరో అయిపోయిన త‌రుణంలో ఎవ‌రూ వినోదం కోసం ఖ‌ర్చే చేసే ఆలోచ‌న‌లో లేనే లేరు. ఒక సంవత్సరం చందాతో పాటు సినిమా చూడటానికి 499 రూపాయల కాంబో ఆఫర్ ఇచ్చినా ఇది కూడా క‌లిసి రాలేదు.

స‌ల్మాన్ న‌టించిన గ‌త చిత్రాల‌న్నీ మొద‌టి రోజే 100 కోట్లు వ‌సూలు చేసిన చ‌రిత్ర ఉంది. వాటితో పోలిస్తే ఈ సినిమా కేవ‌లం 25కోట్లు కూడా తేలేక‌పోయింద‌నేది ఓ విశ్లేష‌ణ‌. జీ సంస్థ‌కు న‌ష్టాలు త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అయితే మ్యూజిక్ హక్కులు... విదేశీ వ‌సూళ్లు... దీర్ఘకాలిక డిజిటల్ వీక్షణలు .. పే ప‌ర్ వ్యూ ద్వారా వ‌చ్చిన మొత్తాల‌తో చాలా వ‌ర‌కూ సేఫ్ అని ట్రేడ్ విశ్లేషిస్తున్నా కొంత న‌ష్టం భ‌రించాల్సి ఉండొచ్చ‌ని విశ్లేషిస్తున్నారు.

కార‌ణం ఏదైనా.. ఒక పెద్ద ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. రాధే మోడ‌ల్ ని ఇత‌రులు అనుస‌రించేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఒక‌వేళ ఏదైనా సినిమాకి తొలిరోజే బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ వ‌స్తే స‌న్నివేశం వేరొక విధంగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. అందుకు టాలీవుడ్ లో రిలీజైన వ‌కీల్ సాబ్ తొలి వీకెండ్ వ‌సూళ్లు.. ఉప్పెన సంచ‌ల‌నాలు ప‌రిశీలించ‌ద‌గిన‌వి. క‌రోనా వెంటాడుతున్నా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఈ సినిమాల్ని ఆద‌రించారు. ఓటీటీల్లోనూ విప‌రీతంగా ఈ సినిమాల్ని ఆద‌రిస్తున్నారు. దేనికైనా కంటెంట్ ఈజ్ ది బాస్ అని ప్రూవైంది. కంటెంట్ లేక‌పోతే స‌ల్మాన్ అయినా సంపూర్ణేష్ బాబు అయినా ఒక‌టే అని నిరూప‌ణ అయ్యింది.
Tags:    

Similar News