అభిమానులే అతిథులుగా.. 'రాధే శ్యామ్' నేషనల్ ఈవెంట్ తేదీ ఖరారు..!

Update: 2021-12-18 09:04 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన చిత్రం ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. రాబోయే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో 'రాధే శ్యామ్' టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - సినిమా టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు డార్లింగ్ అభిమానులందరూ ట్రైలర్ లాంచ్ కోసం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రెండింటికీ మేకర్స్ ఒకే వేదిక మీద ప్లాన్ చేయడం విశేషం.

'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ను కూడా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను డిసెంబర్ 23న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు నిర్మాతలు శనివారం అధికారికంగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసేలా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.

ఒక సినిమా కోసం నేషనల్ స్థాయిలో ఈవెంట్ జరగడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే మొదటి సారి అని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఈవెంట్ లో మరో ప్రత్యేకత ఏంటంటే.. 'రాధే శ్యామ్' ట్రైలర్ ను డార్లింగ్ ఫ్యాన్స్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. అభిమానులే అతిథులుగా.. ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్లను రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ సినిమాలో అభిమానులచే తొలిసారిగా ట్రైలర్ లాంచ్ చేయబడుతున్న కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది.

కాగా, 'రాధే శ్యామ్' చిత్రాన్ని 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందిస్తున్నారు. ఇందులో హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. భాగ్యశ్రీ - జగపతిబాబు - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - ప్రియదర్శి - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ ఇతర పాత్రలు పోషించారు.

కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం సమకూర్చారు. హిందీ వెర్షన్ కు మాత్రం మిథున్‌ - అనూ మాలిక్‌ - మనన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్ అందించారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు.

మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్‌. రవీందర్‌ రెడ్డి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేశారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'రాధే శ్యామ్' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.


Tags:    

Similar News