మ్యూజికల్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్' .. మరో టీజర్ రెడీ!

Update: 2021-10-26 03:49 GMT
'రాధేశ్యామ్' .. ఈ రెండు పేర్లు పవిత్రమైన ప్రేమకు నిర్వచనం .. అమలిన శృంగారానికి నిదర్శనం. అలాంటి ఈ టైటిల్ ను పెట్టినప్పుడే, ఇది ఒక అందమైన ప్రేమకథ అనే విషయం ఆడియన్స్ కి అర్థమైపోయింది. ఇది ఇటలీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అనగానే అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ఈ ప్రేమకథకు పునర్జన్మల లుక్ ఉందని తెలియడం .. ఆ కథకు అద్భుతమైన గ్రాఫిక్స్ తోడవుతున్నాయని చెప్పడంతో అందరిలో కుతూహలం పెరుగుతూ పోతోంది. మొత్తానికి ఇది ఒక సాధారణమైన ప్రేమకథ అయితే కాదు అనే సంకేతాలను ఈ సినిమా ఆల్రెడీ ఇచ్చేసింది.

పునర్జన్మలతో ముడిపడిన ప్రేమ .. భారీ స్థాయిలో ఉపయోగిస్తున్న గ్రాఫిక్స్ .. విదేశీ నేపథ్యం కారణంగా ఈ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. ప్రేమ అనేది ప్రపంచ వస్తువు .. అందువలన ఈ కథను ఏ దేశంలోనైనా .. ఏ భాషలోనైనా విడుదల చేసుకోవచ్చు. ఈ సినిమా వాళ్లు అదే పనిచేస్తున్నారు. ప్రభాస్ - పూజ హెగ్డే నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాను, జనవరి 14వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ పాత్ర పైనే ఫోకస్ చేస్తూ .. ఆయన వాయిస్ ఓవర్ తో వదిలిన ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. కథాకథనాలు సంగతి అటుంచితే తెరపై ఒక అద్భుతాన్ని చూడనున్నామనే విషయం మాత్రం అందరికీ అర్థమైపోయింది. మేకర్స్ ఈ సినిమాను ఖరీదైన కళాఖండంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం అంతా ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, మేకర్స్ మరో టీజర్ ను వదలడానికి సిద్ధమవుతున్నట్టుగా వినికిడి.

మరి ముందుగా ప్లాన్ చేసినట్టుగానే మరో టీజర్ ను వదలనున్నారా? లేదంటే ముందుగా వదిలిన టీజర్ చాలామందికి అర్థం కాలేదని మరో కోణంలో మరొకటి వదలనున్నారా? అనేదే డౌటు. ఇక ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయట. ప్రతిపాట ఓ పండగ అన్నట్టుగా తెరపై వాటిని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఇది మ్యూజికల్ లవ్ స్టోరీ కనుక పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ .. దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. ఇక ఒక్కొక్కటిగా పాటలను వదిలే వేళ కూడా అయింది కనుక, రొమాన్స్ పాళ్లను కొలవడానికి ఉత్సాహంతో రెడీ గా ఉండవలసిందే.
Tags:    

Similar News