చిక్కుల్లో కాంట్ర‌వ‌ర్శీ బ్యూటీ

Update: 2019-04-18 06:45 GMT
వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో అద‌న‌పు ఆదాయ ఆర్జ‌న అన్న‌ది స్టార్ల నిత్య వ్యాప‌కం. అయితే ఆదాయంతో పాటు ప్ర‌జాక్షేమం కూడా ఇంపార్టెంట్ అన్న లాజిక్ మ‌రిస్తే అందుకు త‌గ్గ ప్ర‌తిఫ‌లాన్ని అనుభ‌వించిన వారెంద‌రో. ఒక్కోసారి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ అందులో న‌టించిన స్టార్ల‌కు త‌ల‌నొప్పులు తెస్తుంటాయి. నాణ్య‌తా ప్ర‌మాణాల్లో తేడాలొస్తే ఆ ప్ర‌భావం ప‌డేది అమాయ‌క జ‌నంపైనే కాబ‌ట్టి అలాంటి వాటికి ప్ర‌చారం చేయ‌డాన్ని నేరంగానే ప‌రిగ‌ణిస్తారు. దానిని స‌ద‌రు స్టార్ల‌ అభిమానులే త‌ప్పు ప‌డుతుంటారు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల నాణ్యాతా ప‌రిశీల‌న‌కు అడ్వ‌ర్ టైజ్ మెంట్ స్టాండార్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ) లాంటి సంస్థ ప‌ని చేస్తోంది. ఉత్ప‌త్తి ప్ర‌మాణాల్లో ఏమాత్రం తేడాలొచ్చినా అందులో న‌టించే స్టార్ల‌కు, ఉత్ప‌త్తి త‌యారీదారుకు చిక్కులు త‌ప్ప‌వు.

ప్ర‌స్తుతం అలాంటి చిక్కుల్నే ఎదుర్కొంటోంది అందాల క‌థానాయిక‌ రాధిక ఆప్టే. ర‌క్త చ‌రిత్ర‌, లెజెండ్ లాంటి తెలుగు చిత్రాల్లో న‌టించిన రాధిక ఓవైపు బాలీవుడ్ లో కెరీర్ సాగిస్తూనే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మ‌రోవైపు బోల్డ్ స్టేట్ మెంట్లు ఇచ్చి కాంట్ర‌వర్శీ క్వీన్ గానూ పాపుల‌రైంది. ఆప్టే న‌టించిన `క్లినిక్` వాణిజ్య ప్ర‌క‌ట‌న తాజాగా వివాదంలో చిక్కుకుంది. త‌ల పండ‌కుండా (గ్రే హెయిర్) కాపాడ‌డంలో, న‌ల్ల‌ద‌నం పెంచ‌డంలో ఈ ఉత్ప‌త్తి ప‌నిత‌నం అమోఘం అంటూ ప్ర‌క‌ట‌న రూపొందించారు. అయితే ఇది నిజ‌మా? స‌ద‌రు ఉత్ప‌త్తిని ఉప‌యోగిస్తే త‌ల పండే స‌మ‌స్య త‌లెత్త‌దా?  దీనిపై ఏఎస్ సీఐ రివ్యూ చేసిందిట‌. ఈ రివ్యూలో స‌ద‌రు ప్ర‌క‌ట‌న రూప‌క‌ర్త‌లు మార్గ‌ద‌ర్శ‌కాల్ని అతిక్ర‌మించార‌ని తేలింది. దీంతో ఈ ప్ర‌క‌ట‌న‌లో న‌టించిన‌ రాధిక ఆప్టేకు చిక్కులు త‌ప్పేలా లేవ‌ని చెబుతున్నారు.

భార‌త దేశంలో సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వాణిజ్యం అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. హెయిర్ & బ్యూటీకేర్ రంగం అంత‌కంత‌కు విస్త‌రిస్తోంది. అయితే ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్టు ఉత్ప‌త్తుల్ని అందిస్తున్న కంపెనీలు ఏవో అమాయ‌క జ‌నం క‌నిపెట్ట‌డం అంత‌ సులువేం కాదు. స్టార్లు ప్ర‌చారం చేస్తే అది చెత్త కంపెనీయే అయినా గొప్ప ఉత్ప‌త్తి అని భావించే వీలుంది. ఒక‌వేళ ఆ నాణ్య‌త ప్ర‌మాణాలు పాటించ‌క‌పోతే మునిగేది సామాన్యులే. రాధిక ఆప్టే న‌టించిన క్లినిక్ ప్ర‌క‌ట‌న రూప‌క‌ర్త‌లు ప్ర‌మాణాలు పాటించ‌లేదు కాబ‌ట్టి త‌న‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ఒక్క ఫిబ్ర‌వ‌రిలోనే 243 వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తితే అందులో 60 పైగా ఉత్ప‌త్తుల‌పై ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ ఫిర్యాదుల్లో 83 ఉత్ప‌త్తులు హెల్త్ కేర్ కే చెందిన‌వి అని తెలుస్తోంది.


Tags:    

Similar News