ఇక్కడి వరకు వస్తానని నేను ఊహించలేదు

Update: 2020-08-14 01:30 GMT
1980 మరియు 1990ల్లో టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన రాధిక సినీ రంగ ప్రవేశం చేసి 42 ఏళ్లు పూర్తి అయ్యింది. ఆగస్టు 10న ఈమె మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ 42 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఆమె పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. జీవితంలో ఎన్నో సాధించినట్లుగా ఆమె ఆనందంగా చెప్పుకొచ్చింది. సినీ ప్రస్థానం ప్రారంభించే సమయంలో ఈ స్థాయికి వస్తాను అని నేను అనుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందు అడుగు వేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నాకు ఎంతో మంది సహకారం అందించారు. అభిమానులు నన్ను ఆధరించారంటూ రాధిక ఎమోషనల్‌ అయ్యింది.

రాధికను హీరోయిన్‌ గా పరిచయం చేసిన లెజెండ్రీ డైరెక్టర్‌ భారతీరాజా స్పందిస్తూ... పదహారేళ్ల వయసులో రాధికను పాంచాలి అనే పాత్రతో నేను పరిచయం చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె సినీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆమెకు అంతులేని పాపులారిటీ వచ్చింది. నీ ప్రయాణం ఇంకా కొనసాగాలంటూ కోరుకుంటున్నాను అన్నారు. భారతీ రాజా వ్యాఖ్యలకు స్పందించిన రాధిక మీ ఆశీర్వాదం వల్లే ఇంత ఎత్తుకు ఎదిగాను అంటూ ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.

టాలీవుడ్‌ లో రాధిక మరియు చిరంజీవిలు కలిసి నటించిన చిత్రాలు ఏ స్థాయిలో విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌ తో పాటు దాదాపు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులకు చేరువైన రాధిక బుల్లి తెరపై సీరియల్స్‌ మరియు షో తో రచ్చ రచ్చ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. వెండి తెర బుల్లి తెర అనే తేడా లేకుండా ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా సూపర్‌ హిట్‌ అవుతూ వస్తున్న రాధిక మరింత కాలం నటిగా కొనసాగాలని ఆమె అభిమానులు మరియు సినీ జనాలు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News