శ్రీదేవి సిల్వర్ జూబ్లీ ఫిలిం వచ్చుంటేనా!!

Update: 2018-02-26 00:25 GMT
ఓ కాంబినేషన్ లో రెండు మూడు సినిమాలు వస్తేనే.. అపురూపంగా చెప్పుకునే రోజులు ఇవి. కానీ ఓ దర్శకుడు- ఒక హీరోయిన్ కలిసి ఏకంగా 24 సినిమాలు చేశారంటే అది నిజంగా అద్భుతమైన విషయమే. అందాల తార శ్రీదేవితో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ ఘనతను సాధించారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెలుగులో 15.. హిందీలో 9.. మొత్తం 24 చిత్రాలు రూపొందాయి.

శ్రీదేవి స్టార్ డం సంపాదించడంలో.. రాఘవేంద్రరావు సినిమాలు అందించిన సహకారం చాలానే ఉంటుంది. ఆ మధ్యన ఓ టీవీ షో కోసం వీరిద్దరూ కలిసి కనిపించారు. ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇదే కార్యక్రమానికి శ్రీదేవిని ఎంతగానో ఆరాధించే మరో దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రావడం విశేషం. ఆ సమయంలో రాఘవేంద్రరావు- శ్రీదేవి కాంబినేషన్ లో 25వ చిత్రం గురించిన ప్రస్తావన వచ్చింది. 24 సినిమాలు కలిసి చేసిన తర్వాత.. 25వ చిత్రం కూడా పూర్తి చేస్తే సిల్వర్ జూబ్లీ అవుతుందనే మాటలు జరిగాయి.

ఆ ప్రాజెక్టు గురించి అడిగితే.. 'నా సినిమా ఎలా ఉండాలో మీకంటే ఎవరికి బాగా తెలుస్తుంది' అని రాఘవేంద్రరావును ఉద్దేశించి శ్రీదేవి చెప్పడం విశేషం. వర్మ కనుక నిర్మాతగా వ్యవహరించి.. కథ అందిస్తే.. కచ్చితంగా మూవీ చేస్తానన్నారు దర్శకేంద్రుడు. లార్జర్ దేన్ లైఫ్ కథ అయితే బాగుంటుందని వర్మ అన్నాడు కానీ.. తను కెమేరా ఇలా సెట్ చేస్తానంటే.. రాఘవేంద్రరావు గెంటేస్తారని చెప్పాడు. శ్రీదేవితో సినిమా చేస్తే వర్మ దగ్గర సలహాలు తీసుకుంటానన్నారు రాఘవేంద్ర రావు.

ఈ సంభాషణ అంతా సరదాగా సాగినా.. ఇప్పుడు ఆమె దూరమైపోయిన క్షణంలో మాత్రం.. నిజంగా రాఘవేంద్రరావు- శ్రీదేవి- వర్మ.. ఈ కాంబినేషన్ సాకారం అయి ఉంటే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు. శ్రీదేవి-రాఘవేంద్రరావుల సిల్వర్ జూబ్లీ చిత్రం చూసే అవకాశం దక్కేదని భావిస్తున్నారు.



Tags:    

Similar News