హీరోగా రాఘవేంద్రరావు మరో సినిమా .. దర్శకుడిగా వీఎన్ ఆదిత్య!

Update: 2021-10-06 00:30 GMT
తెలుగు సినిమాకు ఎంతో మంది దర్శకులు మాట నేర్పారు .. ఆట నేర్పారు .. పాట నేర్పారు. తెలుగు కథకి కొత్త మలుపులు చూపిస్తూ, ప్రేక్షకులను అలరించారు. అయితే రాఘవేంద్రరావు - దాసరి నారాయణరావు వచ్చిన తరువాత తెలుగు కథ కొత్త పుంతలు తొక్కింది. దాసరి నారాయణరావు కథలో నాటకీయతకు .. డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. ఇక రాఘవేంద్రరావు పాటలపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. హీరోయిన్ గ్లామర్ ను మరింత గ్లామరస్ గా ఆవిష్కరించడానికి పాటకి మించిన ఆయుధం లేదని ఆయన భావించారు. అదే పద్ధతికి ఆయన కట్టుబడ్డారు.

దాసరి నారాయణరావు తన సినిమాలకు తనే కథ .. మాటలు .. స్క్రీన్ ప్లే .. రాసుకునేవారు. అవసరమైతే .. రచయితలు అందుబాటులో లేకపోతే ఆయనే పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాఘవేంద్రరావు అలా కాదు, దర్శకత్వంపై మాత్రమే ఆయన దృష్టి పెట్టేవారు. సినిమా వేడుకలలో కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు. ఈ మధ్యనే తన సినిమాలకి సంబంధించిన టీవీ ప్రోగ్రామ్స్ లో మాట్లాడటం మొదలుపెట్టారు .. అది కూడా చాలా తక్కువగా. అలాంటి రాఘవేంద్రరావు తెరపై కనిపిస్తారనీ .. నటిస్తారని ఎవరూ ఊహించలేదు.

రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD' సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలోను కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు ప్రధానమైన పాత్రధారిగా ఒక సినిమా రూపొందనుంది. కథ అంతా కూడా ఆయన చుట్టూనే తిరుగుతుంది. తనికెళ్ల భరణి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఆయన దర్శకతం చేస్తానని అంటేనే ఆ ప్రాజెక్టు చేస్తానని రాఘవేంద్రరావు అంటే, తనికెళ్ల భరణి ఓకే అనేశారట. ఇక ఈ సినిమా తరువాత రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమాను ఒప్పుకోవడం విశేషం.

రాఘవేంద్రరావు కథానాయకుడిగా దర్శకుడు వీఎన్ ఆదిత్య ఒక కథను రాసుకున్నాడట. ఆ కథ నచ్చడంతో చేయడానికి రాఘవేంద్రరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలపోయాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో చేయవలసిన సినిమా పూర్తయిన తరువాతనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఇక నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు గనుక ఆయన మెగాఫోన్ పక్కన పెట్టేశారనుకుంటే పొరపాటే. త్వరలో ఆయన ఒక సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

రాఘవేంద్రరావు ఒక దశలో వరుసగా భక్తి రసాత్మక చిత్రాలను తెరకెక్కించారు. ఆ సినిమాల్లో 'అన్నమయ్య' .. 'శ్రీరామదాసు' సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ఈ తరహా కథలను ఆయన ఆ స్థాయిలో మెప్పిస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే ఆ తరువాత చేసిన 'పాండురంగడు' .. 'శిరిడీ సాయి' .. ' ఓం నమో వేంకటేశాయ' సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. 'ఓం నమో వేంకటేశాయ' తరువాత గ్యాప్ తీసుకున్న రాఘవేంద్రరావు, మళ్లీ మెగా ఫోన్ పడుతున్నది ఇప్పుడే. ఈ సినిమా వివరాలు .. విశేషాలు త్వరలో తెలియనున్నాయి.



Tags:    

Similar News