అమరన్ 'పరాశక్తి'... 70 ఏళ్ల తర్వాత!
ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కోలీవుడ్ యంగ్ స్టార్ శివ కార్తికేయన్ ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన అమరన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వసూళ్ల పరంగా చూసుకుంటే విజయ్, రజనీకాంత్‌ల సరసన శివ కార్తికేయన్ నిలిచాడు. ఆర్మీ ఆఫీసర్‌గా శివ కార్తికేయన్ ఆ సినిమాలో నటించి సూపర్ హిట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఈ యువ హీరో నటిస్తున్నాడు. పైగా ఈ సినిమా ఆయన కెరీర్‌లో 25వ సినిమా కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
SK25 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను రెడీ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో టీజర్‌ను రెడీ చేశారని తెలుస్తోంది. టీజర్‌ని మంచి సమయం చూసి విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు. ఆ టీజర్‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. కోలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దర్శకురాలు సుధ కొంగర 'పరాశక్తి' అనే విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. శివాజీ గణేశన్ క్లాసిక్ మూవీ 'పరాశక్తి' టైటిల్‌ను ఈ సినిమాకు వినియోగించడం ద్వారా తమిళ్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 70 ఏళ్ల క్రితం వచ్చిన పరాశక్తి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
అంచనాలకు తగ్గకుండా సుధా కొంగర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలో ఈమె దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా సినిమాకు మంచి స్పందన వచ్చింది. థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసుకుని ఉండేది అనే అభిప్రాయం ఉంది. అందుకే సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ సినిమా అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఈమధ్య కాలంలో శ్రీలీల జోరు మామూలుగా లేదు. వరుసగా ఆమె తెలుగు సినిమాలు చేస్తూ సక్సెస్‌లను సొంతం చేసుకుంటుంది. కనుక పరాశక్తి తో శ్రీలీల మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో రవి మోహన్, అధర్వలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుధా కొంగర చాలా గ్యాప్ తీసుకుని, స్క్రిప్ట్‌పై ఎక్కువ రోజులు వర్క్ చేసి ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శివ కార్తికేయన్ ఈ సినిమాను సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అమరన్ సినిమాతో తమిళనాట మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డం దక్కించుకున్న శివ కార్తికేయన్ కచ్చితంగా ఈ సినిమాతో మరింతగా భారీ సక్సెస్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయమై అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.