టాలీవుడ్ సీనియర్ హీరోల త్రయంతో దర్శకేంద్రుడి భారీ మల్టీస్టారర్...!

Update: 2020-04-26 12:53 GMT
మల్టీస్టారర్ ట్రెండ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సినీ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుండి వస్తున్నదే. అప్పటి జనరేషన్ హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు ఇలా అందరు హీరోలు కలిసి నటించిన వారే. కానీ ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం మల్టీస్టారర్ మూవీస్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ మరియు ఇతర పరిశ్రమలలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్స్ చేయడం తరుచుగా చూస్తూ ఉంటాం. కానీ మన టాలీవుడ్ స్టార్ హీరోలు అలా కాదు, ఇమేజ్, స్క్రీన్ స్పేస్, ఫ్యాన్స్ ఒపీనియన్స్ అనే అనేక విషయాలు అడ్డు వస్తాయి. అయితే కొన్నాళ్లుగా ట్రెండ్ మారింది. స్టార్ హీరోల మధ్య మల్టీ స్టారర్ లు చిన్నగా ఊపందుకుంటున్నాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోలు కలిశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ - మెగా హీరో రామ్ చరణ్ ల మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఇందుకు నిదర్శనం. వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేస్తారని కలలో కూడా ఎవరు ఉహించి వుండరు. 'ఆర్ ఆర్ ఆర్' తో దర్శకుడు రాజమౌళి దానిని సాధ్యం చేశాడు. అయితే వీటన్నింటికంటే ముందే ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు తన కెరీర్లో మైలురాయి లాంటి 100వ చిత్రంగా ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట.

సీనియర్ స్టార్ హీరోల త్రయం మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున - విక్టరీ వెంకటేశ్‌‌ లు హీరోలుగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసి.. దానికి ‘త్రివేణి సంగమం’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. దీని గురించి అప్పట్లో న్యూస్ హల్ చల్ చేసాయి. అయితే ముగ్గురు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూపించాలని దర్శకేంద్రుడు చేసిన ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్‌ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తన 100వ చిత్రంగా ‘గంగోత్రి’ని చేశారు రాఘవేంద్రుడు. ఒకవేళ ‘త్రివేణి సంగమం’ సినిమా పట్టాలెక్కి టాప్ హీరోలు చిరు, నాగ్, వెంకీ ఒకే సినిమాలో కనిపిస్తే అది ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసుండేది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. అప్పట్లోనే టాలీవుడ్‌ లో మల్టీస్టారర్స్ హవా పెరిగేది. అయితే ‘త్రివేణి సంగమం’ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట రాఘవేంద్రరావు. ఈ ప్రాజెక్ట్‌ బాధ్యతలు తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడికి అప్పగించాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారింది.. ఇలాంటి సమయంలో ఈ భారీ మల్టీస్టారర్ వస్తే సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త వరవడి సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.
Tags:    

Similar News