ఈ కాంబినేషన్ చాలా రేర్ గురూ

Update: 2015-12-06 06:36 GMT
తూర్పు.. పడమరలు కలుస్తాయా? కలిసే ఛాన్సే ఉండదు. కానీ.. రాజకీయాలు అలా కాదు.. తూర్పు.. పడమరలుగా ఉండే వారు సైతం కలిసిపోతారు. భుజాలు.. భుజాలు రాసుకుపూసుకు తిరుగుతారు. అయితే.. ఇది అందరికి వర్తించదు. ఉప్పు.. నిప్పులా ఉండిపోయేలా వాళ్లూ ఉన్నారు. తాము నమ్మిన సిద్ధాంతాల కోసం అన్నట్లుగా నిలబడే వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారు కలిసిన క్షణాలు అపురూపంగా ఉండిపోతాయి. రెండు భిన్న ధ్రువాల్లాంటి నేతలు కలిసిన ప్రతిసారీ కాస్తంత ఆసక్తి వ్యక్తమవుతుంటుంది. ఎవరు ఎలా ఉంటారు? ఏమేం మాట్లాడతారూ అని.

తాజాగా అలాంటి సన్నివేశమే కనిపించింది. అంబేడ్కర్ 60వ వర్థంతి సందర్భంగా రాజకీయ కురువృద్ధుడైన బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ.. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు.. గాంధీ కుటుంబానికి యువ ప్రతినిధి రాహుల్ గాంధీలు ఇద్దరూ కలిసారు. ఈ సందర్భంగా వారు పక్కపక్కనే కూర్చున్నారు.

దీంతో.. అందరి చూపులు వారిద్దరి మీదనే. ఎవరు ఎలా ఉంటారు. ఏం చేస్తారు? అసలు మాట్లాడుకుంటారా? అన్నట్లు పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అద్వానీతో ఏవో కబుర్లు చెబుతూ రాహుల్ కనిపించారు. దీనికి అద్వానీ నవ్వుతూ వినటం కనిపించింది. ఇలా ఇద్దరు భిన్న భావాలున్న వ్యక్తులు ఒకచోట చేరి..  పక్కపక్క కూర్చొని నవ్వుతూ మాట్లాడుకోవటం చూస్తే.. అసలు సిసలు రాజకీయం ఇదేనని అనిపించక మానదు. అరుదుగా ఆవిష్కృతమయ్యే ఇలాంటి సన్నివేశాల్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతే వేరని చెప్పక తప్పదు.
Tags:    

Similar News