రాజమౌళి - అల్లు అర్జున్ కాంబోలో భారీ ప్రాజెక్ట్..?

Update: 2022-03-16 10:30 GMT
భారతదేశం గర్వించదగ్గ దర్శకులతో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ.. వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే అపజయం ఎరుగని డైరెక్టర్ గా.. దర్శకధీరుడుగా పిలవబడుతున్నారు.

'బాహుబలి' తో ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళితో వర్క్ చేయాలని ప్రతీ హీరో కోరుకుంటారు. దిగ్గజ దర్శకుడి చిత్రంలో చిన్న పాత్ర లభించినా చాలనుకునే నటీనటులు ఎందరో ఉన్నారు.

రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్ - ప్రభాస్ - రవితేజ - రామ్ చరణ్ - నాని - సునీల్ వంటి హీరోలతో కలిసి పనిచేశారు. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో జక్కన్న ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఫ్యూచర్ లో తాను వర్క్ చేయాలనుకునే హీరోలలో బన్నీ ఒకరని రాజమౌళి ఆ మధ్య ప్రకటించారు. అయితే గతేడాది లాక్ డౌన్ టైంలో తన తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్‌ తో కలిసి అల్లు అర్జున్ కోసం కొన్ని ఆసక్తికరమైన స్టోరీ లైన్స్ అనుకున్నారట.

అంతేకాదు ఇప్పటికే బన్నీతో రాజమౌళి - బాహుబలి రచయిత కలిసి రెండు మూడు మీటింగ్స్ కూడా జరిపారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జక్కన్న ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ప్రస్తుతం దర్శక హీరోల లైనప్ చూస్తే 2023 లో వీరి కాంబోలో సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే క్రమంలో మహేష్ బాబుతో ఓ జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చూస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో #SSMB29 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఇందులో అలియా భట్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్. ఈ మూవీ తర్వాత బన్నీ స్క్రిప్టు మీద జక్కన్న వర్క్ చేస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

మరోవైపు 'పుష్ప: ది రైజ్' చిత్రంతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' ని సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో రాజమౌళితో పాటుగా సంజయ్ లీలా భన్సాలీ - సందీప్ రెడ్డి వంగా వంటి పలువురు దర్శకులతో బన్నీ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News