క‌నీసం జ‌క్క‌న్న‌కైనా క‌థ తెలుసా!?

Update: 2018-04-04 07:23 GMT
ఆర్ ఆర్ ఆర్‌... టాలీవుడ్‌లో ఇంత‌లా వార్త‌ల్లో నిలిచిన సినిమా మ‌రోటి లేదేమో! ముగ్గురు స్టార్లు క‌లిసున్న ఒక్క ఫోటో బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించే డిస్క‌ర్ష‌న్ జ‌రుగుతోంది. టాలీవుడ్ అంతా ఈ సినిమా గురించి ఎదురుచూస్తోంది. అయితే ఈ షూటింగ్ ఇప్పుడు మొద‌ల‌వుతుంది... అప్పుడు మొద‌ల‌వుతుంది... అని వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ఒక్కొక్క‌రు బాంబులు పేల్చుతున్నారు.

మొద‌ట రామ్ చ‌ర‌ణ్‌... ఈ సినిమా క‌థ విన‌లేద‌ని... క‌థ తెలియ‌కుండానే రాజ‌మౌళి సినిమా కాబ‌ట్టి ఓకే చెప్పేశాన‌ని చెప్పి పెద్ద బాంబ్ పేల్చాడు. ఇప్పుడు తార‌క్ కూడా చ‌ర‌ణ్ మాటే నా మాట‌... క‌థ నాకూ తెలీదు... అంటూ మ‌రో షాక్ ఇచ్చాడు. దీంతో హీరోల‌కే క‌థ తెలియ‌దంటే ఇంత‌కీ సినిమా తీస్తున్న ద‌ర్శ‌కుడికైనా స్టోరీ తెలుసా! అని అనుకుంటున్నారు. రాజ‌మౌళి సినిమాల‌కి ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తాడ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాజ‌మౌళి మంచి యాక్ష‌న్ మ‌ల్టీస్టార‌ర్ క‌థ అడిగాడ‌ని... ఆ క‌థ కోసం ప‌ని చేస్తున్నా...అని ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కి ఈ మ‌ల్టీస్టార‌ర్ వార్త‌లు వ‌చ్చాయి. అంతే క‌థ రెఢీ అయిపోయింద‌ని అనుకున్నారంతా.

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల క‌థ అని కొంద‌రు... ఈ సినిమాలో చెర్రీ- తార‌క్ బాక్స‌ర్లుగా క‌నిపించ‌బోతున్నార‌ని మ‌రికొంద‌రు ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఇద్ద‌రు హీరోలు ముకుమ్మ‌డిగా క‌థ తెలియ‌ద‌ని చెప్ప‌డంతో ఇవ‌న్నీ కేవ‌లం రూమార్సే అనే విష‌యం తేలిపోయింది. అయితే చ‌ర‌ణ్ - తార‌క్ క‌లిసి ఓ ట్రయిల్ షూట్ కోసం అమెరికా వెళ్లారు. వ‌చ్చారు! అంటే క‌థ వీరిద్ద‌రికీ తెలిసే ఉంటుంద‌ని... అయితే మీడియాకి లీక్ చేయ‌డం ఇష్టం లేక ఇలా కావాల‌నే సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నార‌నే వాళ్లూ ఉన్నారు.

విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ చెప్పాలి. అది జ‌క్క‌న్న‌కి న‌చ్చాలి. అప్పుడే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లెడ‌తాడు రాజ‌మౌళి. లేదంటే సినిమా గురించి మాట్లాడ‌ను కూడా మాట్లాడ‌డు. ఒక‌వేళ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కాన్సెప్ట్ గురించి ర‌ఫ్ గా ఓ పాయింట్ అనుకుని... దాన్ని పూర్తి క‌థ‌గా మార్చేందుకు కొడుకుని టైమ్ అడిగాడేమో తెలీదు. తార‌క్ కూడా సినిమా గురించి రాజ‌మౌళి చెబితేనే బాగుంటుంద‌ని చెప్ప‌డంతో... క‌థ సిద్ధంగా ఉంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతోంది! ఏమైనా... జ‌క్క‌న్న చెప్పేదాకా... ఈ సినిమా విష‌యంలో ఓ క్లారిటీ రాదు.
Tags:    

Similar News