బాహుబలి బాలీవుడ్లో ఎందుకు చేయలేదంటే.

Update: 2016-06-27 11:30 GMT
‘బాహుబలి’ సినిమా కోసం ఏడాది డేట్లివ్వమని రాజమౌళి అడిగితే.. ఏడాది ఎక్కడ సరిపోతుంది.. రెండేళ్లు తీస్కోమన్నాడట ప్రభాస్. మరి ‘బాహుబలి’ సినిమాను హిందీలో తీద్దామని రాజమౌళి ముంబయికెళ్లి ఏ స్టార్ హీరోనైనా ఒక ఏడాది డేట్లు అడిగి ఉంటే ఒప్పుకుని ఉంటారా..? ఒక వేళ ఒప్పుకున్నా రెండేళ్ల పాటు సినిమా తీస్తూ కూర్చుంటే ఊరుకుని ఉంటారా..? ఈ చిన్న లాజిక్కే తాను ‘బాహుబలి’ని హిందీలో తీయకపోవడానికి కారణమని అంటున్నాడు రాజమౌళి. తెలుగు నటీనటులతో తీస్తేనే 600 కోట్లు వచ్చాయి.. ఇదే సినిమాను బాలీవుడ్ స్టార్ హీరోలతో తీస్తే ఇంకా రేంజి పెరిగేది కదా అని రాజమౌళిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగితే ఇలా స్పందించాడు.

‘‘బాహుబలి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాక నా చేతిలో స్క్రిప్టుతోపాటు షెడ్యూల్ కూడా రెడీగా ఉంది. ఈ సినిమాకు రెండేళ్లు డేట్లిచ్చే స్టార్లు కావాలని మాకు తెలుసు. ఐతే రెండేళ్లపాటు ఎలాంటి కమిట్మెంట్లు లేకుండా బాలీవుడ్లో ఎవరైనా  డేట్లు ఇవ్వగలరా? అది సాధ్యం కాదు కాబట్టే బాహుబలి హిందీలో చేయలేదు. బాలీవుడ్ స్టార్లను పెట్టాలని అనుకుని ఉంటే అసలీ సినిమా తెరకెక్కేదే కాదని నా అభిప్రాయం’’ అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాను చూసి తెలుగు.. తమిళ భాషల్లో చాలా సినిమాల్ని ద్విభాషా.. త్రిభాషా చిత్రాలుగా చేస్తుండటంపై రాజమౌళి స్పందిస్తూ.. ‘‘కుల.. మత.. జాతి.. భాష.. వీటన్నింటికీ అతీతంగా ఉన్న కథతో సినిమా తీస్తేనే చాలా భాషల్లో విడుదల చేయగలం. అలా కాని కథల్ని వేర్వేరు భాషల్లో విడుదల చేయాలని చూస్తే ప్రయోజనం ఉండదు’’ అని రాజమౌళి అభిప్రాయపడ్డాడు.
Tags:    

Similar News