రాజశేఖర్ కి శివలింగం సెంటిమెంట్!

Update: 2022-01-12 09:30 GMT
రాజశేఖర్ ఎక్కడికి వెళ్లినా జీవితతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు వెంట ఉండవలసిందే. వాళ్లు వెంట లేకుండా అసలు ఆయన ఎక్కడా కనిపించరు. రాజశేఖర్ కి తన కూతుళ్లంటే ఎంత ప్రేమ అనేది ఆయన మాటల ద్వారా తెలిసిపోతూనే ఉంటుంది. ఆయన తన ఇద్దరి కూతుళ్లకు శివాని .. శివాత్మిక అనే పేర్లు పెట్టారు. పెద్ద కూతురు 'అద్భుతం' సినిమా ద్వారా, చిన్న కూతురు 'దొరసాని' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన కూతుళ్లకు ఆ పేర్లు పెట్టడానికి కారణం .. తన ఇష్టదైవం శివుడు కావడమేనని తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాజశేఖర్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో జీవిత మాట్లాడుతూ .. "ఫస్టు పాప పుట్టినప్పుడు శివాని అనే పేరు పెట్టేశాము. రెండవసారి బాబు పుడితే శివ అనే పేరు పెడదామని అనుకున్నాము. కానీ రెండవ సారి కూడా పాపనే పుట్టింది. దాంతో శివాత్మిక అనే పేరు పెట్టడం జరిగింది. రాజశేఖర్ గారు శివ భక్తుడు .. ఆయన మెడలో చిన్న శివలింగం ఉంటుంది. తనకి శివుడంటే చాలా ఇష్టం కనుక .. గోల్డ్ తో చిన్న శివలింగం చేయించుకుని మెడలో వేసుకున్నారు. చిత్రమైన విషయమేమిటంటే ఆ శివలింగం ఇప్పటికీ రెండు మూడుసార్లుపోయింది. అయినా మళ్లీ అది ఆయన దగ్గరికే వచ్చింది.

ఒక సారి ఆ చైన్ పోయింది .. దొరికిందని తెచ్చి ఇచ్చారు. మరోసారి చెన్నై ఫిల్మ్ సిటీలో జాగింగ్ కి వెళితే అక్కడ ఆ శివలింగం పోయింది. రూమ్ కి వచ్చేసిన తరువాత చూసుకుంటే చైన్ కి శివలింగం లేదు. అంత పెద్ద ఫిల్మ్ సిటీలో అంత చిన్న శివలింగం ఎక్కడని వెతుకుతాం .. ఎలా దొరుకుతుంది? కష్టమేనని ఆయనతో అన్నాను. అయినా ఆయన ఆ శివలింగం గురించే ఆలోచన చేస్తూ కూర్చున్నారు. ఆ తరువాత అక్కడి వాచ్ మెన్ కి కాల్ చేసి, ఆ శివలింగం పోయిన విషయం చెప్పారు. అది తనకి చాలా సెంటిమెంట్ అనీ .. ఎవరికి దొరికినా తీసుకోమని .. తాను డబ్బులు ఇస్తానని చెప్పారు.

మరుసటి రోజు ఆ శివలింగం దొరికిందని చెప్పేసి ఫోన్ వచ్చింది .. ఆ తరువాత ఆ శివలింగాన్ని తెచ్చి ఇచ్చారు. అంత చిన్న శివలింగం పోయినప్పటికీ ఆయనకి మళ్లీ మళ్లీ ఎలా దొరుకుంతుందని నేను ఆశ్చర్యపోతుంటాను. 'అల్లరి ప్రియుడు' సినిమా షూటింగు సమయంలో కూడా ఆ శివలింగం పోయింది .. మళ్లీ దొరికింది. ఆయన శివభక్తుడు .. ఆ శివలింగం మళ్లీ మళ్లీ దొరకడం వెనుక ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తూ వుంటుంది" అంటూ జీవిత చెప్పుకొచ్చారు. ఇక 'అంకుశం' సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, రామిరెడ్డి రియాక్షన్ కరెక్టుగా రావడం కోసం, ఆయనను నిజంగానే కొట్టవలసి వచ్చిందంటూ రాజశేఖర్ నవ్వేశారు.       
Tags:    

Similar News