టాక్ బ్లాక్ బస్టరే కానీ వసూళ్లు చూస్తే..

Update: 2017-11-20 01:30 GMT
కొన్నిసార్లు టాక్ అంత గొప్పగా లేకున్నప్పటికీ వసూళ్లు అదిరిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు చాలా మంచి టాక్ వచ్చినా వసూళ్లు అంత గొప్పగా ఉండవు. ‘గరుడవేగ’ సినిమా రెండో కోవకే చెందుతుంది. రెండు వారాల కిందట విడుదలైన ఈ సినిమాకు ఈ సినిమాకు అన్ని వైపులా ప్రశంసలు దక్కాయి. రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. ప్రేక్షకులూ ఈ సినిమాను ప్రశంసించారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. మొదట్లో పబ్లిసిటీ కూడా బాగానే చేసినట్లు కనిపించారు. కానీ అన్ని సానుకూలతలూ ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. రెండు వారాల్లో కలిపి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.7 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.

ఈ సినిమా బడ్జెట్.. దీనికి వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈ వసూళ్లు చాలా తక్కువనే చెప్పాలి. ఈ ఏడు కోట్లలో కూడా అమెరికా షేర్ రూ.1.5 కోట్లు ఉండటం గమనార్హం. మిగతా ఔట్ సైడ్ ఏరియాలు కూడా తీసేస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు లెక్క. రూ.25-30 కోట్ల మధ్య ఈ చిత్రానికి బడ్జెట్ పెట్టినట్లు చెప్పుకున్నారు. ఆ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలకు ఒకట్రెండు రోజుల్లోనే రూ.5 కోట్ల షేర్ వచ్చేస్తుంటుంది. కానీ ప్రి రిలీజ్ బజ్ లేకపోవడం.. రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉండటం.. ఈ చిత్రానికి సరైన సంఖ్యలో, మంచి థియేటర్లు దొరక్కపోవడం మైనస్ అయింది. మొత్తానికి పోస్టర్ మీద బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అని వేస్తున్నారు కానీ.. అది టాక్ వరకు పరిమితమైంది. వసూళ్ల కోణంలో చూస్తే ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి.
Tags:    

Similar News