పంది పాత్రకు ఆ నటుడి వాయిస్

Update: 2018-10-28 09:55 GMT
హాలీవుడ్లో తెరకెక్కే యానిమేటెడ్ మూవీస్‌ లో జంతువుల పాత్రలకు అక్కడి ప్రముఖ నటులు వాయిస్ ఇస్తుంటారు. ఐతే మన దగ్గర ఇలాంటి ప్రయత్నాలు చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగులో విలక్షణ దర్శకుడు రవిబాబు ఈ తరహాలోనే ‘అదుగో’ పేరుతో ఓ విభిన్నమైన సినిమా చేశాడు. ఇందులో ఓ పంది పిల్ల ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాత్రకు ఎవరితో వాయిస్ ఇప్పించి ఉంటాడా అన్న ఆసక్తి జనాల్లో ఉంది.

ఈ ఆసక్తికి తగ్గట్లే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తో పంది పిల్ల పాత్రకు డబ్బింగ్ చెప్పించాడు రవిబాబు. నట కిరీటి వాయిస్ ఈ పాత్రకు కచ్చితంగా పెద్ద అస్సెట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన హీరో రాజేంద్ర ప్రసాద్. తర్వాత కొన్ని సీరియస్ పాత్రలు వేసినా.. ఎప్పుడైనా కామెడీ చేయాల్సి వస్తే ఆయన చెలరేగిపోతుంటారు. ‘జులాయి’ అందుకు మంచి ఉదాహరణ. వాయిస్ మాడ్యులేషన్ తో కామెడీ పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘అదుగో’ ట్రైలర్ చూస్తే నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపించింది.

పంది పిల్ల విన్యాసాలు కడుపుబ్బ నవ్వించేలాగే ఉన్నాయి. దీనికి రాజేంద్రుడి వాయిస్ కూడా తోడైతే మరింత బాగా ఆ పాత్ర పండే అవకాశముంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘అదుగో’ వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చత్రంలో ‘అవును’ హీరోయిన్ పూర్ణ.. పంది పిల్లకు గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనుండటం.. ఆమె ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేయడం విశేషం. దీపావళి కానుకగా నవంబరు 7న ‘అదుగో’ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags:    

Similar News