ర‌జ‌నీ-ధ‌నుష్! మామ అల్లుళ్ల‌కు జాతీయ అవార్డుల‌తో పండ‌గే పండ‌గ‌!!

Update: 2021-10-25 08:47 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ కు 67వ జాతీయ పుర‌స్కారాల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారతీయ చలనచిత్ర ప్రపంచానికి ఆయన చేసిన అద్భుతమైన సేవలకు గాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు నుండి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. తెల్ల కుర్తా-పైజామాలో ర‌జ‌నీ ఈ వేడుకకు హాజరయ్యారు. అతనితో పాటు భార్య లత- కుమార్తె ఐశ్వర్య -అల్లుడు ధనుష్ ఉన్నారు. దిల్లీలో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ఇదే వేదిక‌పై `అసురన్` చిత్రానికి గాను ధనుష్ జాతీయ చలనచిత్ర (త‌మిళం) అవార్డును అందుకున్నారు. ఒకే వేదిక‌పై మామ అల్లుళ్లు ఎంతో చిద్విలాసంగా పుర‌స్కారాల్ని అందుకుంటూ క‌నిపించారు. ఆ ఇద్ద‌రినీ ఈ వేదిక‌పై ఇలా చూసుకోవ‌డం అభిమానుల‌కు క‌న్న‌లపండుగ అనడంలో సందేహం లేదు.

నిజానికి జాతీయ పుర‌స్కార గ్ర‌హీత‌ల వివ‌రాల్ని బిజెపి రాజ్యసభ ఎంపి ప్రకాష్ జవదేకర్ ఈ ఏడాది ఏప్రిల్ లో మొదట ప్రకటించారు. ఇదే విషయాన్ని అభిమానులకు గుర్తుచేస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివ‌రాల్ని వెల్లడించింది.``ర‌జనీకాంత్ తన అభిమానులు తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. భారతదేశపు అత్యున్నత చలనచిత్ర పురస్కారమైన 51వ #దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అక్టోబర్ 25న అందుకుంటారు`` అని తెలియ‌ప‌రిచింది. 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గత సంవత్సరం ప్రకటించాల్సి ఉండ‌గా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా వేసారు.

రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ గ్రహీత అయిన రజనీకాంత్ దక్షిణ భారతీయ చిత్రాలలో ప్ర‌ధానంగా నటించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్నారు. ద‌శాబ్ధాల కెరీర్ లో ర‌జ‌నీ హిందీ చిత్ర‌సీమ‌లోనూ సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. 2018 అవార్డు గ్రహీత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో క‌లిసి 1991 యాక్షన్-డ్రామా `హమ్‌`లో రజనీకాంత్ న‌టించారు.

ర‌జ‌నీ 1975లో కె బాలచందర్ అపూర్వ రాగంగళ్ తో ఆరంగేట్రం చేసారు. తమిళ చిత్ర పరిశ్రమలో 45 సంవత్సరాల కెరీర్ ని పూర్తి చేసి అర్థ‌ సెంచ‌రీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. ఎఆర్ మురుగదాస్ `దర్బార్‌`లో చివరిసారిగా కనిపించిన ర‌జ‌నీ త్వరలో మోస్ట్ అవైటెడ్ అన్నాథే (పెద్ద‌న్న‌) చిత్రంతో అల‌రించ‌నున్నారు. ద‌రువు శివ దర్శకత్వం వహిస్తున్న‌ `అన్నాథే`లో నయనతార- కీర్తి సురేష్- ఖుష్బూ - ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు నటించారు. నవంబర్ 4 న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలాసార్లు వాయిదా పడింది.


Tags:    

Similar News