ఫ్యాన్స్‌ కు హామీ ఇచ్చిన సూపర్‌ స్టార్‌

Update: 2019-05-13 12:46 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల గురించి గత రెండు దశాబ్దాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పటి నుండి కూడా అదుగో ఇదుగో అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు రజినీకాంత్‌ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించాడు. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్న రజినీకాంత్‌ - ఎప్పుడైతే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వస్తాయో ఆ వెంటనే తన పార్టీని ప్రకటించి - క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రజినీకాంత్‌ ప్రస్తుతం చేస్తున్న 'దర్బార్‌' చిత్రం చివరిదై ఉంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. రజినీకాంత్‌ సినిమాలు మానేస్తాడంటే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేసినా కూడా సినిమాలు కూడా చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా తన సినిమాల గురించి మీడియలో వస్తున్న వార్తలపై రజినీకాంత్‌ క్లారిటీ ఇచ్చాడు. దర్బార్‌ చిత్రం తర్వాత సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించాడు.

పార్టీ పెట్టిన తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతానంటూ ప్రకటించాడు. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే వరకు తాను సినిమాల్లో నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయడంతో పాటు తన పార్టీ అభ్యర్థులను కూడా పోటీకి దించుతాను అంటూ రజినీకాంత్‌ చెప్పుకొచ్చాడు. దర్బార్‌ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా కోసం కథా చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రజినీకాంత్‌ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయాలని భావిస్తున్నాడు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయితే అప్పుడు పరిస్థితి ఏంటీ అనేది చూడాలి.
Tags:    

Similar News