‘కాలా’ను వాళ్లు వదులుతారా?

Update: 2018-06-08 07:39 GMT
అనుకున్నట్లే గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కాలా’కు డివైడ్ టాక్ వచ్చింది. ‘కబాలి’ కంటే ఇది బెటర్ అంటున్నారే తప్ప.. మామూలుగా చూస్తే రజనీ స్థాయికి తగ్గ సినిమా కాదిది. ఇక రజనీ సినిమా అంటే విడుదలకు ముందో తర్వాతో ఏదో ఒక కాంట్రవర్శీ అన్నది కామన్. ‘కాలా’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కావేరీ జల వివాదానికి సంబంధించి రజనీ చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు జరిగాయి. అక్కడ సినిమానే రిలీజవ్వలేదు. మరోవైపు ‘కాలా’ సినిమాను తన తండ్రి కథతో తీశారంటూ జవహర్ అనే ముంబయి జర్నలిస్టు కోర్టుకెక్కడం తెలిసిన సంగతే. ఇవి కాక రిలీజ్ తర్వాత ‘కాలా’ను మరికొన్ని తలనొప్పులు చుట్టుముట్టేలా కనిపిస్తోంది.

‘కాలా’ క్లైమాక్స్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా చివర్లో విలన్ నానా పటేకర్‌ ను రాముడిగా.. హీరో రజనీని రావణుడిలా సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు రంజిత్. రజనీని ఎలా చూపించినా ఓకే కానీ.. విలన్ అయిన నానాను రాముడిగా చూపించడం మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆల్రెడీ హిందూ సంఘాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. రాముడితో పాటు వినాయకుడిని సినిమాలో అభ్యంతకరంగా చూపించారని అంటున్నారు. రాముడిని.. రామాయణాన్ని చులకన చేయడం తమిళులకు మామూలే అని.. ఇంతకుముందు డీఎంకే అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా రామాయణాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఉటంకిస్తూ ‘కాలా’ వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమవుతున్నారు కొందరు హిందూ నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు వీళ్లకు మద్దతుగా నిలిచి.. రజనీ సినిమాకు బ్రేక్ వేస్తుందేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
Tags:    

Similar News