కోలీవుడ్ హీరోలను చూసి ఈలలు వేసే సంస్కృతి మన దగ్గర ఎప్పటి నుంచి వచ్చిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు తెలుగు హీరోల కోసం ఈలలు వేసే తెలుగు సినీ ప్రేక్షకులు రజినీకాంత్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి పరభాష నటులకు కూడా ఈలలు వేయడం మొదలు పెట్టారు. ఓ విధంగా చెప్పాలంటే రజినీకాంత్ కి టాలీవుడ్ లో స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఉంది. కోలీవుడ్ లో ఏ స్థాయిలో అయన సినిమాలు రిలీజ్ అవుతాయో.. ఇక్కడ కూడా అదే స్థాయిలో రిలీజ్ అవుతాయి.
అందుకే రజినీకాంత్ కూడా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఇష్టపడతారు. ఆయన సినిమాలు ఏవి డబ్ అయినా ఆ సినిమాల ప్రమోషన్స్ కి తప్పకుండా వస్తారు. అంతే కాకుండా రజినీ వాయిస్ కి తెలుగు డబ్బింగ్ చెప్పే మనో డబ్బింగ్ థియేటర్స్ లో ఉన్నప్పుడు తప్పకుండా ఒక్కసారైనా రజినీ వస్తారట. వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరిస్తారని మనో పలు ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 2.0 సినిమా యొక్క ఆడియో వేడుక నిన్న దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఆ కార్యక్రమంలో తెలుగు వ్యాఖ్యాతగా ఉన్న రానా - రజనీ కాంత్ గారిని ఒక తెలుగు డైలాగ్ చెప్పమని కోరగా సూపర్ స్టార్ తెలుగు అభిమానులకు తన సినిమాల్లో ఎంతో ఇష్టమైన బాషా సినిమాలోని డైలాగ్ ని చెప్పారు. 'నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’.. అని చెప్పడంతో ఆ ప్రాంతమంతా ఈలలతో చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఈ వేడుకలో బాలీవుడ్ తరపున కరణ్ జోహార్ యాంకర్ గా ఉండగా తమిళ్ బాషా తరపున ఆర్జే.బాలాజీ హోస్ట్ గా ఉన్నాడు.