రజినీకి అన్నీ తెలిసి కూడా..

Update: 2020-12-25 12:38 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారన్న సమాచారం వారిని కంగారు పెట్టేస్తోంది. ఆయన తమ ఆసుపత్రిలో చేరారని.. చికిత్స అందిస్తున్నామని.. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వాళ్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. రజినీ ఇటీవలే ‘అన్నాత్తె’ షూటింగ్ కోసం తన టీంతో కలిసి హైదరాబాద్ రావడం.. జాగ్రత్తల మధ్య షూటింగ్‌లో పాల్గొనడం తెలిసిందే. ఐతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. యూనిట్లో కొందరు కోవిడ్ బారిన పడ్డారు. షూటింగ్ ఆగిపోయింది. రజినీకి కరోనా పరీక్షలు చేశారని, నెగెటివ్ వచ్చిందని ముందే వార్తలు వచ్చినప్పటికీ అభిమానుల్లో ఆందోళన పోలేదు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు కూడా అవగాహన ఉంది.

ఇప్పుడు కూడా కరోనా నెగెటివ్ అంటూనే.. బీపీ ఫ్లక్చువేషన్ సహా కొన్ని ఇబ్బందులున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. రజినీ గతంలో రెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం.. ఒక సమయంలో ఆయన ప్రాణాలకే అపాయం ఏర్పడటం.. రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండి చికిత్స తీసుకోవడం.. మరోసారి అమెరికాలో చికిత్స పొందడం తెలిసిన సంగతే. కరోనా వల్ల యుక్త వయసులో, ఆరోగ్యంగా ఉన్న వారికి పెద్దగా ఇబ్బంది లేదు కానీ.. పెద్ద వయస్కులు, అనారోగ్య సమస్యలున్నవారి మీద మాత్రం అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. రజినీ వయసు 70 ఏళ్లు కాగా.. ఆయన అనారోగ్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రజినీ ఆరేడు నెలలు ఇంటి నుంచి బయటికి రాలేదు. కానీ ఈ మధ్య కరోనా ప్రభావం తగ్గిందని బయటికొచ్చారు. రాజకీయ రంగప్రవేశంపై అభిమానులతో చర్చించారు. ‘అన్నాత్తె’ బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా ఆసుపత్రి పాలయ్యారు.

బాలసుబ్రహ్మణ్యం అనుభవం చూశాక రజినీ లాంటి వాళ్లు పూర్తిగా కరోనా ప్రభావం పోయే వరకు బయటికి వచ్చే సాహసమే చేయాల్సింది కాదన్న అభిప్రాయాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మళ్లీ షూటింగ్‌కు వెళ్తున్నాడన్నపుడే కరోనా భయాలు కలిగాయి. ఇప్పుడు ఆయన వైరస్ బారిన పడ్డట్లేమీ వార్తలు రాకున్నా ఆసుపత్రిలో చేరడం అభిమానుల్ని కంగారు పెడుతోంది. కరోనా భయంతో ఒక దశలో రాజకీయ అరంగేట్రాన్నే రద్దు చేసుకోవాలనుకున్న రజినీ.. ఇప్పుడెందుకిలా ఆలోచన మార్చుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
Tags:    

Similar News