ప్రతి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఆ టాక్ ఎక్కువయిందనే చెప్పాలి. ఎప్పుడు లేనంతగా గత కొంత కాలంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం గురించి కొంత మందికి తెలుగు హీరోయిన్స్ పెదవి విప్పడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా శ్రీ రెడ్డి - మాధవి లత స్పందించిన విషయం తెలిసిందే. అయితే మొదట శ్రీ రెడ్డి చెప్పడం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. కానీ ఎవరు స్పందించలేదు.
ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో అలాంటివేమీ లేదని చెప్పడంతో ఒక్కసారిగా క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఊపందుకుంది. శ్రీ రెడ్డి - మాధవీలత ఇద్దరు రకుల్ స్పందించిన తీరును తప్పు బట్టారు. జనాలను పిచోళ్ళని చేస్తున్నావా? అని కౌంటర్లు కూడా ఇచ్చారు. బిజినెస్ చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నావ్ అంటూ.. ఇతర విషయాలను కూడా ప్రస్తావిస్తూ రకుల్ పై మాటలతో విరుచుకుపడ్డారు. అయితే రకుల్ కి ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో అమ్మడు ఒక్కసారిగా షాక్ అయ్యింది.
అంతే కాకుండా ఆ విమర్శలకు ఒక్కసారిగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా పేరెంట్స్ కి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేకుంటే వాళ్లకు ఈ విషయం అర్ధమైతే ఇలాంటి ఇండస్ట్రీలో నువ్ వర్క్ చేస్తున్నావా అని అనేవారు. అలా ఆలోచిస్తే ఎంతో అవమానకరంగా ఉంటుందని చెప్పింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడకండని రకుల్ తెలిపింది.