చిత్ర‌పురి స‌మ‌స్య‌ల‌పై గ‌ళం!!

Update: 2019-07-03 06:46 GMT
సినిమా 24 శాఖ‌లు కొలువుండే చిత్ర‌పురి కాల‌నీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందంటూ ఇప్ప‌టికే బోలెడ‌న్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌పై హౌసింగ్ సొసైటీ అధికారులు రివ్యూలు చేసి ప‌రిష్కృతం కాని స‌మ‌స్య ఇద‌ని లైట్ తీస్కున్నారు. ధ‌న‌ప్ర‌వాహం సాగే చోట ఇలాంటి వివాదాలు స‌హ‌జ‌మేన‌ని .. అయితే `చిత్ర‌పురి క‌మిటీ` ఎంతో శ్ర‌మిస్తే కానీ ఈ కాల‌నీ ఆ మేర‌కు రూపురేఖ‌లు సంపాదించ‌లేక‌పోలేద‌న్న సానుభూతి ప‌రులు ఉన్నారు. కొండ‌లు - బండ‌లు తిర‌గేసి మొత్తానికి 20ఏళ్ల పాటు శ్ర‌మిస్తే ద‌క్కిన ఫ‌ల‌మిది. అయితే ఈ కాల‌నీలో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల గురించి కాల‌నీయేత‌ర వాసులు సైతం గ‌ళం విప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

చిత్ర‌పురి కాల‌నీకి ప్ర‌భుత్వం 64 ఎక‌రాల స్థ‌లం ఇచ్చింది. మేటి న‌టుడు దివంగ‌త‌ ప్ర‌భాక‌ర్ రెడ్డి డొనేట్ చేసిన ఎక‌రాల స్థ‌లం ఇందులో ఉంది. అయితే అపార్ట్ మెంట్లు నిర్మించ‌గా మిగిలిన ఇత‌ర‌త్రా ఖాళీ స్థ‌లంలో మాక్కూడా ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని కోరుతూ నేడు కొంద‌రు సినీ-టీవీ కార్మికుల బృందం చిత్ర‌పురి క‌మిటీ ముందు భైటాయించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. `మా భూమి- మా ఇల్లు- మా హ‌క్కు` పేరుతో ఫిలింఛాంబ‌ర్ నుంచి చిత్ర‌పురి క‌మిటీ ఆఫీస్ వ‌ర‌కూ ర్యాలీని నిర్వ‌హించారు. క‌స్తూరి శ్రీ‌నివాస‌రావ్ అనే కార్మిక నాయ‌కుని సార‌థ్యంలో సాగిన ఈ ర్యాలీలో కార్మికులంతా త‌మ‌కు ఇల్లు కావాల‌న్న గోడును వెల్ల‌బోసుకున్నారు. అయితే ఓవైపు కార్మికులంతా ఇల్లు కావాల‌ని కోరుతుంటే .. ఈ కాల‌నీలో స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్థావించిన ర్యాలీ నిర్వాహ‌కుల తీరుపై తిర‌గ‌బ‌డ‌డంతో ర్యాలీ ర‌సాభాస‌గా మారింది.

చిత్ర‌పురి కాల‌నీ నిర్మాణ క్ర‌మంలో ఎంద‌రో ఎన్నో ర‌కాలుగా అడ్డుక‌ట్ట వేసేందుకు రాజ‌కీయంగానూ ప్ర‌య‌త్నించారు. కానీ సినీపెద్ద‌ల అకుంఠిత ధీక్ష‌తో అది నేడు పూర్తి స్థాయిలో విజ‌య‌వంత‌మైంది. ఇందులో సింగిల్ బెడ్ రూమ్స్- ట్రిపుల్ బెడ్  రూమ్స్ ఇప్ప‌టికే కార్మికుల‌కు అప్ప‌జెప్పారు. అయితే ఇందులో కొంద‌రు అప్పులు- ఫ్యామిలీ క‌ష్టాల‌తో ఈఎంఐలు చెల్లించ‌లేని స‌న్నివేశంలో అమ్మేసుకున్నార‌ని.. వాటిని బ‌య‌టివారికి అమ్మేసార‌ని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే వేదిక‌పై చిత్ర‌పురి కాల‌నీలో ఉన్న కార్పొరెట్ స్కూల్ కైరోస్ గురించి ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. ఖ‌రీదైన ఈ కార్పొరెట్ స్కూల్లో ల‌క్ష‌ల్లో చెల్లించి కార్మికుల పిల్ల‌ల్ని చ‌దివించ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించారు. అలాగే చిత్ర‌పురి క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ కార్మికుల కోసం స‌ద్వినియోగం కాకుండా వృధాగా ప‌డి ఉంద‌ని .. క‌మిటీ వాళ్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు విన్న‌వించారు. అలాగే చిత్ర‌పురి కాల‌నీ వాసులు కాజ‌గూడ జంక్ష‌న్ వ‌ద్ద రోడ్డు దాటేందుకు ఫ్లైవోవ‌ర్ బ్రిడ్జి లేక‌పోవ‌డంతో ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. నిరంత‌రం ర‌ద్దీగా ఉండే ఈ హైవేలో ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వెళ్లేందుకు వెసులుబాటు లేక‌పోవ‌డంతో స్కూల్ చిన్నారులు .. ఆడ‌వాళ్లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. ఎల‌క్ష‌న్ అంటే ఓట్లు దండుకునేవాళ్లే కానీ క‌ష్ట‌కాలంలో ఆదుకునే రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రూ లేర‌న్న ఆవేద‌నా కార్మికుల్లో క‌నిపించింది. అలాగే చిత్ర‌పురి కాల‌నీకి శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు క‌మిటీ కృషి చేయాల‌ని కాల‌నీ కార్మికులు కోరారు.
Tags:    

Similar News