చైన్ స్మోకింగ్ అనుభవాన్ని వెల్లడించిన రాపో..!

Update: 2022-07-12 03:45 GMT
టాలీవుడ్ లో స్మోకింగ్ చేసే అలవాటున్న సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. షూటింగ్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు.. సెట్ లోనో లేదా కార్వాన్ లోకో వెళ్లి దమ్ము కొట్టేసి వస్తుంటారు. అయితే ధూమపానం అలవాటు లేని నటీనటులు కూడా సినిమాలలో తాము చేసే పాత్రల డిమాండ్ ని బట్టి స్మోకింగ్ చేయాల్సి వస్తుంది. యువ హీరో రామ్ పోతినేనికి కూడా అలాంటి అనుభవమే ఉంది.

'జగడం' టైంలో నాకు 18 ఏళ్ళు. సినిమా షూటింగ్ లో ఎక్కువగా సిగరెట్ తాగాల్సి వచ్చింది. నా జీవితంలో అప్పటి వరకు నేను స్మోకింగ్ చేయలేదు. సినిమా కోసం అలాంటి కష్టాలు పడాల్సి వచ్చిందని రామ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జగడం సినిమా చేస్తున్నప్పుడు తాను చైన్ స్మోకర్ అయ్యానని.. షూటింగ్ చివరి రోజున ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

ఆ తర్వాత 'ఒంగోలు గిత్త' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు రామ్ స్మోకింగ్ చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్మోక్ చేస్తున్నాను.. చివరి సారిగా చేసింది క్యారక్టర్ డిమాండ్ చేసినందుకే.. ఇప్పుడు కూడా అందుకే.. ఐ హేట్ స్మోకింగ్ అంటూ రాపో అప్పట్లో ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత 'శివమ్' 'ఇస్మార్ట్ శంకర్' 'రెడ్' వంటి పలు చిత్రాల్లో రామ్ సిగరెట్ తాగుతూ కనిపించారు.

'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ టైంలో రామ్ నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో పొగ తాగారని చార్మినార్ పోలీసులు ఆయనకు రూ. 200 జరిమానా కూడా విధించారు. అయితే అప్పుడు కూడా పాత్ర డిమాండ్ మేరకు సినిమా షూటింగ్ లో భాగంగానే హీరో సిగరెట్ తాగాల్సి వచ్చింది.

దీనిపై రామ్ వివరణ కూడా ఇచ్చారు. 'నా టైము.. పబ్లిక్ టైము వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే.. షాట్లా కాల్చిన తమ్మి.. బ్రేక్ లా కాద్.. టైటిల్ సాంగ్ లా చూస్తావ్గా స్టెప్పు.. ఫిర్ బి లా కి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినమ్.. గిప్పుడు నువ్వు కూడా నా లెక్క.. లైట్ తీసుకో పని చూస్కో.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్' అంటూ సినిమాలోని తన పాత్ర మాట్లాడినట్లు ట్వీట్ చేశారు రామ్.

కొంతమంది నటీనటులు సినిమాల ప్రయోజనాల కోసం స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేసి అదే అలవాటుగా మార్చుకున్నారు. కానీ రామ్ మాత్రం పాత్ర డిమాండ్ మేరకు స్మోక్ చేసినా.. దాన్ని రియల్ లైఫ్ లో అలవాటుగా మార్చుకోలేదు. సినిమాల్లో స్మోకింగ్ చేసినా ధూమపానం చేయొద్దని తన వంతు బాధ్యతగా చెబుతూ వస్తుంటారు.

ఇకపోతే ఉస్తాద్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ''ది వారియర్'' రిలీజ్ కు రెడీ అయింది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాపో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇది రామ్ కు కోలీవుడ్ డెబ్యూ మూవీ. తెలుగు తమిళ భాషల్లో జులై 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో రామ్ ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకున్నారు.
Tags:    

Similar News