డాక్టర్ మాట భయపెట్టింది.. మీ అభిమానం ధైర్యాన్ని ఇచ్చింది!

Update: 2022-07-11 08:30 GMT
రామ్ కి ఎనర్జిటిక్ స్టార్ అనే బిరుదు ఉంది .. అభిమానులంతా ఆయనను 'ఉస్తాద్' అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ది వారియర్' రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగుకి సన్నాహాలు  జరుగుతున్న సమయంలోనే రామ్ 'జిమ్'లో గాయపడ్డాడు. ఆ సమయంలో తాను అనుభవించిన ఆవేదనను, ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై గుర్తుచేసుకుని రామ్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో ఆయనకి మాటలు రాకపోవడంతో .. మంచినీళ్లు తాగాడు.

ఆ తరువాత  రామ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా చేస్తున్నప్పుడు ఫస్టు టైమ్ నాకు హెల్ప్ లెస్ స్టేట్ అంటే ఏమిటో తెలిసింది. ఈ సినిమా మొదలుకావడానికి నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో, మరింత ఫిట్ నెస్ కోసం నేను రెండు పూటలా జిమ్ చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే 'జిమ్'లో గాయం అయింది. వారాలు గడుస్తున్నా అది తగ్గకపోగా, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. అలా మూడు నెలలు గడిచిపోయాయి. అయినా పెయిన్ తగ్గకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లాను.

నేను ఉన్న పరిస్థితుల్లో ఒక కిలోకి మించి బరువులు మోయవద్దని ఆ డాక్టర్ చెప్పారు. 'అది కాదు సార్ .. బరువులు మోయాలి.. ఫైట్స్ .. సాంగ్స్ ఉన్నాయి" అన్నాను. అప్పుడు  ఆయన 'మీకు లైఫ్ ముఖ్యమా?  సినిమాలు ముఖ్యమా?" అని అడిగారు.

సినిమానే లైఫ్ అనుకున్న నాకు ఆ ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్ లోనిదిగా అనిపించింది. ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ మళ్లీ ట్విట్టర్ ఓపెన్ చేశాను. మీరంతా పంపించే మెసేజెస్ ఒక్కొక్కటిగా చదువుతూ వెళ్లాను. మీరంతా కూడా 'అన్నా నువ్వేమీ చేయకు .. ఈ సినిమా వరకూ నీ నుంచి మేమేమీ ఆశించడం లేదు' అంటూ ట్వీట్ చేశారు.

అన్ కండిషనల్ లవ్ అనేది ఎలా ఉంటుందనేది అప్పుడు నాకు అర్థమైంది. మీరు లేకపోతే నేను లేననే విషయం కూడా అప్పుడే నాకు తెలిసింది. రామ్ అంత పెయిన్ లోను చేయడం గొప్ప విషయమని మా టీమ్ అంటోంది.

నా బాడీలోని  ఎనర్జీ అంతా మీ నుంచే వచ్చింది. ఈ సినిమాలో నేను అంత బాగా చేయడానికి కారణం మీరే .. మీరు ఇచ్చిన ధైర్యం వల్లనే డాన్సులు .. ఫైట్లు చేయగలిగాను. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది .. అందరూ కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి " అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News