వద్దు బాబోయ్ అనుకుంటూనే పోలీస్ రోల్ చేశాడట!

Update: 2022-07-11 07:53 GMT
ఎన్టీ రామారావు దగ్గర నుంచి బాలకృష్ణ వరకూ తెలుగు తెరపై పోలీస్ పాత్రలు తమ జోరును చూపుతూ వచ్చాయి. పోలీస్ పాత్రల్లో మరింత హీరోయిజం కనిపిస్తుంది. ఆ యూనిఫామ్ కి మాస్ యాక్షన్ తోడైతే మరో రేంజ్ లో ఉంటుంది. అందువల్లనే కుర్ర హీరోలంతా పోలీస్ పాత్రల వైపు పరుగులు తీస్తున్నారు. రాజశేఖర్ తరువాత పోలీస్ పాత్రల హవా తగ్గింది. కానీ మళ్లీ ఇప్పుడు పోలీస్ పాత్రలపై యంగ్ హీరోలకీ మోజు పెరిగిందనే విషయం అర్థమవుతోంది. రామ్ కూడా కొంత కాలంగా పోలీస్ పాత్రలపై మనసు పారేసుకున్నాడట.

ఆ విషయాన్ని గురించి నిన్న రాత్రి జరిగిన 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. "పోలీస్ డ్రెస్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది .. ఆ యూని ఫామ్ లోనే ఏదో తెలియని ఒక పవర్  ఉంటుంది.

అందువల్లనే నేను కూడా పోలీస్ సినిమాలు చేయాలనుకున్నాను. అలా అనుకున్నదే తడవుగా పోలీస్ కథలను వినడం మొదలుపెట్టాను. ఒకటి .. రెండు .. మూడు .. నాలుగు .. ఇలా పోలీస్ కథలను వరుసగా వింటూనే ఉన్నాను. చివరికి అన్ని కథలు ఒకలానే ఉంటున్నాయనిపించింది.

పోలీస్ కథలో కొత్త  పాయింట్ ఏదైనా ఉంటే అప్పుడు ట్రై చేద్దాం .. అప్పటివరకూ మాత్రం ఈ ఆలోచనను పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. ఆ సమయంలో లింగుసామి నా దగ్గరికి వచ్చాడు.

ఇక ఇప్పట్లో పోలీస్ కథలు చేయనే వద్దని అనుకున్న నేను .. ఏదో ఫార్మాలిటీకి వినేసి .. ఏదో ఒకటి చెబుదాములే అనుకుని విన్నాను. కథ అంతా విన్నాక ఇలాంటి సినిమా కదా మనం చేయవలసింది అనిపించింది. వెంటనే ఆయనకి ఓకే చెప్పడమే కాదు .. ఎప్పుడూ లేని విధంగా ఫ్యాన్స్ కోసం ఒక ట్వీట్ కూడా పెట్టాను" అంటూ చెప్పుకొచ్చాడు.

రామ్ అంతకుముందు విన్న పోలీస్ కథల్లో లేని ప్రత్యేకత ఈ సినిమాలో ఏముందనేది చూడాలి. ఇక మరో విశేషం ఏమిటంటే ..  రామ్ తో ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాని హరీశ్ శంకర్, తమ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేస్తే, రామ్ తో ఈ సినిమా చేసిన లింగుసామి .. ఆయనతో మరో పది సినిమాలు చేయాలనుందని అనడం. అటు హరీశ్ .. ఇటు లింగుసామి .. ఎవరి కోరిక నెరవేరాలన్నా, ఈవెంట్ లో కనిపించిన సందడి థియేటర్లలో కూడా కనిపించవలసి ఉంటుంది మరి!
Tags:    

Similar News