జేగంట‌: 'సైరా' ద‌స‌రా రిలీజ్

Update: 2019-01-08 08:32 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై `సైరా- న‌ర‌సింహారెడ్డి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని దాదాపు 200కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు - టీజ‌ర్ కి మెగాభిమానులు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కామ‌న్ ఆడియెన్ లో అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి మ‌రో స్థాయిలో పెద్ద‌తెర‌పై క‌నిపించ‌నున్నార‌ని, ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అసాధార‌ణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నార‌ని అర్థ‌మైంది. పొద‌ల్లోంచి దూసుకొచ్చే సైరా న‌ర‌సింహుని ఉగ్ర రూపాన్ని టీజ‌ర్ లో ఆవిష్క‌రించిన తీరు మైమ‌రిపించింది. చెట్టు ఆకు తెగి నేల‌పై ప‌డే లోపే శ‌త్రువు తల తెగి నేల‌పై ప‌డే రేంజులో ఉద్రేకం క‌లిగించే పోరాటాల్ని ఈ చిత్రంలో చూడ‌బోతున్నామ‌ని టీజ‌ర్ లోని గ్లింప్స్ చెప్పాయి.

అదంతా అటుంచితే.. సైరా షూటింగ్ అంత‌కంత‌కు ఆల‌స్యమ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. పైగా భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ వ‌ల్ల ఈ సినిమాని తొంద‌ర‌గా రిలీజ్ చేయ‌లేని స‌న్నివేశం త‌లెత్తిందిట‌. వాస్త‌వానికి 2019 సంక్రాంతి బ‌రిలో సైరా చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావించినా - చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేయ‌లేక‌పోయారు. ఇదే విష‌యాన్ని నిర్మాత రామ్ చ‌ర‌ణ్ తాజాగా హైద‌రాబాద్ అన్న‌పూర్ణ సెవ‌న్ ఏక‌ర్స్ లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో ధృవీక‌రించారు.

``సైరా చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. అయితే అన్ని ప‌నులు పూర్తి చేసి 2019 ద‌స‌రాకి రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం`` అని తెలిపారు. అంతేకాదు `సైరా` బ‌డ్జెట్ గురించి టాప్ సీక్రెట్ ని చ‌ర‌ణ్ ఈ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి కేవ‌లం రూ.150- 200 కోట్ల మేర బ‌డ్జెట్ పెడుతున్నార‌నే అంతా భావించారు. కానీ ఈ సినిమాకి రూ.250 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చించామ‌ని రామ్ చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీనిని బ‌ట్టి సైరా చిత్రాన్ని ఇండియ‌న్ స్క్రీన్ పై ఏ స్థాయిలో తెర‌కెక్కించ‌నున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. బాహుబ‌లి చిత్రాన్ని రూ.200కోట్ల బ‌డ్జెట్ లో తీశారు. అలాగే బాహుబ‌లి 2 చిత్రానికి 250-300 కోట్ల మేర బ‌డ్జెట్ వెచ్చించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో `సైరా` చిత్రానికి బ‌డ్జెట్ వెచ్చించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.  `సైరా` చిత్రాన్ని నాన్న‌కు కానుకగా ఇవ్వాల‌ని అమ్మ (సురేఖ‌) కోరారు. అందుకే ఈ చిత్రాన్ని రాజీ లేకుండా నిర్మిస్తున్నాన‌ని చ‌ర‌ణ్ ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలోనూ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి `సైరా` జేగంట మోగిన‌ట్టే. ద‌స‌రా బ‌రిలో రాయ‌ల‌సీమ‌కు చెందిన‌ గ్రేట్ వారియ‌ర్ ఉయ్యాల‌వాడ‌ బ‌యోపిక్ ని వీక్షించ‌బోతున్నామ‌న్న‌ది ఖాయ‌మైంది.


Full View

Tags:    

Similar News