చరణ్ తప్పు ఒప్పెసుకున్నట్టేగా?

Update: 2019-01-16 06:05 GMT
ఎవరు అవునన్నా కాదన్నా వినయ విధేయ రామ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి రెండు రోజులు చరణ్ క్రేజ్ తో పాటు పండగ సెలవులు ఉండటంతో అడ్వాన్సు బుకింగ్స్ తో పాటు ఫ్యాన్స్ అండదండల వల్ల వసూళ్లు బాగా వచ్చాయి కాని ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎక్కడో ఒకటో రెండో బీసి సెంటర్స్ మినహాయించి విపరీతమైన డ్రాప్ ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నేల విడిచి సాము చేసిన హీరోయిజం మీద సోషల్ మీడియాలో ఇంకా ట్రాలింగ్ నడుస్తూనే ఉంది. దీనికి జడిసే హీరో ట్రైన్ లో బీహార్ వెళ్ళే సీన్ డిలీట్ చేసారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే ఫ్యాన్స్ తో సహా అందరికి వస్తున్న అనుమానం ఒకటే. అసలు చరణ్ ఆ తర్వాత చిరులు కథ వినే దీన్ని యాక్సెప్ట్ చేసారా లేక బోయపాటి శీను మీద గుడ్డి నమ్మకంతో సెట్స్ కి వెళ్ళిపోయారా అని. చెర్రి మాత్రం దర్శకుడు ఏది చెబితే అది చేసానని ఇలా అవుట్ పుట్ రావడంలో తన ప్రమేయం ఏమి లేదనేలా ఇంటర్వ్యూలలో  చెబుతున్నాడు. నిజానికి దర్శకులను హీరోలు గుడ్డిగా నమ్మడం అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు దాసరి రాఘవేంద్ర రావు లాంటి దర్శకులు ఎవరైనా హీరోలను కలిసి సినిమా చేయాలి అనుకున్నప్పుడు డేట్స్ ఇచ్చాకే కథను వినేవాళ్ళట స్టార్లు. అంత నమ్మకం వాళ్ళ మీద. ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకులుగా వాళ్ళకిచ్చే గౌరవం అది.

అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. బడ్జెట్లు పెరిగిపోయాయి. ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టంగా మారింది. వందల కోట్ల పెట్టుబడులు చేతులు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరో అయినా దర్శకుడు అయినా సమాన బాధ్యత తీసుకోవాలి. అంతే తప్ప నేను గుడ్డిగా చేసానని హీరో ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఈ కథను తీసానని దర్శకుడు చెప్పుకోవడం సరికాదు. చరణ్ శీనులలో ఈ డిజాస్టర్లో ఎవరికి ఎక్కువ భాగం ఉంది అంటే చెప్పడం కష్టం కాని దీన్నో పాఠంగా తీసుకుని మాస్ కథలను ఒప్పుకునేటప్పుడు స్టార్ హీరోలు జాగ్రత్త వహించడం చాలా అవసరం.
   

Tags:    

Similar News