సుకుమార్ గర్వించేలా చేసిన ఈ అమ్మాయి కథ విన్నారా?
అందుకు కారణం సుకుమార్ ఇంట్లో పనమ్మాయి సాధించిన ఘనత.
'పుష్ప 2' రిలీజ్‌కి రెడీ అవుతున్న వేళ ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ పేరు నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇప్పుడు వేరొక కారణంతోను సుక్కూ పేరు హెడ్ లైన్ లోకి వచ్చింది. అందుకు కారణం సుకుమార్ ఇంట్లో పనమ్మాయి సాధించిన ఘనత. సుకుమార్, ఆయన భార్య తబితతో కలిసి ఉన్న ఆ యువతి ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఆ యువతి పేరు దివ్య. ఇటీవలే తన పై చదువులు పూర్తి చేసుకుని, ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. దీంతో సుకుమార్- తబిత దంపతుల ఆనందానికి అవధుల్లేవ్. తమ ఇంట్లో పని చేసిన ఒక సాధారణ యువతి ఇలా మెరిట్ లో చదువును కొనసాగించడమే గాక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు తెలిపారు. తబిత ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా ఆ యువతి ఫోటోని షేర్ చేసారు. తమతో కలిసి జీవించడానికి, తమకు సహాయం చేయడానికి వచ్చిన యువతి తన చదువును పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవ్వడం గర్వంగా ఉందని ఆమె వెల్లడించారు.
''దివ్య తన ఉజ్వల భవిష్యత్తులో రెక్కలు విప్పి ఎగరడం చూసినప్పుడు కలిగిన సంతృప్తి వర్ణనాతీతం. ఆమె తన కలలను నెరవేర్చుకుంటూ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు తనను అభినందిస్తున్నాము. ఈ అమ్మాయి ఇంకా బాగా ఎదగాలి.. కొత్త ప్రారంభానికి శుభాకాంక్షలు! నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది దివ్యా!!''అంటూ తబిత సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసారు. ఆ యువతిని సుకుమార్ కుటుంబం చదివించిందని సమాచారం.