రామ్ చరణ్ పారితోషకం తీసుకోలేదా?

Update: 2016-11-03 11:30 GMT
‘ధృవ’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఆడకుంటే రామ్ చరణ్ స్టార్ హీరోల రేసులో బాగా వెనుకబడిపోతాడు. ‘బ్రూస్ లీ’ తర్వాత చాలా టైం తీసుకుని పట్టాలెక్కించిన సినిమా ఇది. అసలే ప్రూవ్డ్ సబ్జెక్ట్.. పైగా అల్లు అరవింద్ హ్యాండ్ కూడా పడటంతో ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందనే ఆశతో ఉన్నారు మెగా అభిమానులు. విశేషం ఏంటంటే ఈ సినిమాకు రామ్ చరణ్ పారితోషకమే తీసుకోలేదట. ఐతే మావయ్య సినిమా కాబట్టి ఫ్రీగా చేసేశాడు అనుకుంటే పొరబాటే. అతడికి పారితోషకం అందుతుంది. కానీ అందుకు షరతులు వర్తిస్తాయి. ఆ షరతు ఏంటంటే.. సినిమా హిట్టవ్వాలి. విడుదల తర్వాత లాభాలు వస్తే అందులోంచి చరణ్ కు వాటా వెళ్తుంది. ఈ షరతు చరణ్ కు మాత్రమే కాదు.. దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా వర్తిస్తుంది.

‘ధృవ’కు పరిమితమైన బడ్జెట్ కేటాయించాడట అల్లు అరవింద్. ఆ బడ్జెట్లోనే సినిమాను ముగిస్తూ.. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చూసుకునేందుకు రామ్ చరణ్.. సురేందర్ ప్రస్తుతానికి పారితోషకాలు త్యాగం చేశారు. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటం.. సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ కూడా ఉండటంతో కచ్చితంగా సినిమా హిట్టవుతుందని.. లాభాలు వస్తాయని.. అందులోంచి వాటా తీసుకుందామని ఒప్పందానికి వచ్చారట చరణ్.. సురేందర్. ఈ సినిమాను చాలా ఏరియాల్లో గీతా ఆర్ట్సే.. వేరే సంస్థల భాగస్వామ్యంతో రిలీజ్ చేస్తోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో.. చరణ్.. సురేందర్ రెడ్డిలకు ఏమాత్రం పారితోషకం ముడుతుందో చూడాలి. డిసెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News