అందుకే 'ధ్రువ' కు వసూళ్లు తగ్గాయి

Update: 2018-03-30 13:09 GMT
అప్పటిదాకా కెరీర్ బాగానే కొనసాగిన రామ్ చరణ్ స్పీడుకు బ్రూస్ లీ సినిమా ప్లాప్ అవ్వడంతో బ్రేకులు పడ్డాయి. అందుకే సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ సమయమే తీసుకుని బాగా కష్టపడి ధ్రువ సినిమా చేసాడు. తమిళ సినిమా తాని ఒరువన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. హిట్ టాక్ సంపాదించింది కానీ సినిమా కలెక్షన్ల రూపంలో చెర్రీ ని సంతృప్తి పరచనట్టు తెలుస్తోంది.

ఆ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించడానికి బాగా కష్టపడి బాడీ ని బిల్డ్ చేసిన మెగా పవర్ స్టార్ సినిమా కలెక్షన్ల పరంగా ఎందుకు డౌన్ అయిందో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. " దురదృష్టవశాత్తు ధ్రువ సినిమా వచ్చిన సమయంలో దేశం డీమానిటైజేషన్ తో దెబ్బతింది. కాబట్టి మన ప్రేక్షకులు సినిమా కోసం డబ్బులు కర్చుపెట్టాలి అనుకోలేదు. అందుకే ధ్రువ కొంచెం మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద తడబడింది. కానీ నా వరకు నేను ప్రతి సినిమా లాగానే ఈ సినిమా గురించి కూడా గర్వంగా ఉంటాను" అని చెప్పుకొచ్చాడు మెగా హీరో.

తమిళ్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి తెలుగులో కూడా నటించారు. నయనతార - జయం రవి తమిళ్ లో ముఖ్య పాత్రల్లో నటించగా రామ్ చరణ్ సరసన తెలుగులో రకుల్ ప్రీత్ నటించింది. ఈ సినిమా డిసెంబర్ 9 2016 లో విడుదల అయింది. చెర్రీ నటించిన రంగస్థలం సినిమా ప్రస్తుతం థియేటర్ల లో బాగానే సందడి చేస్తోంది.


Tags:    

Similar News