40 ఏళ్ల క్రితం మేఘ ఆకాశ్ కనిపిస్తే ఎత్తుకెళ్లిపోయేవాడిని: రామ్ గోపాల్ వర్మ

Update: 2021-08-30 02:55 GMT
మేఘ ఆకాశ్ ప్రధాన పాత్రధారిగా 'డియర్ మేఘ' సినిమా రూపొందింది. అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కథానాయకులుగా ఆదిత్ అరుణ్ - అర్జున్ సోమయాజుల నటించారు. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం వచ్చేనెల 3వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను జరుపుకుంది. ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు రామ్ గోపాల్ వర్మ కూడా హాజరయ్యారు.

ఈ వేదికపై వర్మ మాట్లాడుతూ .. "మేఘ ఆకాశ్ నా మార్క్ హీరోయిన్ కాదు. ఆమె చాలా హోమ్లీగా .. క్యూట్ గా ఉంటుంది. 40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే, నేను డైవర్స్ తీసుకుని ఉండేవాడిని కాదు. 'రక్తచరిత్ర' సినిమాలో మాదిరిగా ఒక పదిమందిని చంపేసి నేను ఆమెను ఎత్తుకుని వెళ్లిపోయి ఉండేవాడిని. మేఘ నిజంగా చాలా స్వీట్ .. ఆమెను కలిసిన వాళ్లకి డయాబెటిస్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇక ఆదిత్ అరుణ్ ని మేఘ స్థాయిలో పొగిడితే నన్ను 'గే' అనుకుంటారు కాబట్టి, నేను ఆ పని చేయడం లేదు.

ఈ విషయంలో నాపై ఎలాంటి నిందలు ఉన్నప్పటికీ ఎవరూ నమ్మరని నాకు తెలుసు. త్వరలో ఆదిత్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించి సంగీతం .. కెమెరా పనితనం .. టేకింగ్ చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంతమంచి ఫీల్ ఉన్న సాంగ్స్ ను నేను ఇప్పుడే విన్నాను. నేను నా లైఫ్ లో నా వైఫ్ కి డియర్ అని చెప్పాను. కానీ అది 'డియర్ మేఘ' అవ్వలేదు" అంటూ చెప్పుకొచ్చారు. వర్మ తన గురించి మాట్లాడుతూ ఉంటే, మేఘ ఆకాశ్ స్టేజ్ పై ముసిముసినవ్వులు నవ్వుతూ సిగ్గుపడిపోయింది.

ఇక ఆ తరువాత ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ .. " సాధారణంగా నేను చాలా ఎక్కువ మాట్లాడతాను .. కానీ ఈ రోజున మాటలు రావడం లేదు. ఎందుకంటే థియేటర్లలో నా సినిమా విడుదలై 28 నెలలు అవుతోంది. అందువలన ఇప్పుడు నాకు ఒక పండుగ వచ్చినట్టుగా ఉంది. సినిమా గురించి నేను ఏమీ చెప్పాలనుకోవడం లేదు .. థియేటర్లలో చూడండి. దర్శకుడు సుశాంత్ రెడ్డితో నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. కలిసి సినిమాలకి వెళ్లే సాన్నిహిత్యం ఉంది.

నా మొదటి సినిమా 'కథ' అప్పుడు నేను సినిమాలకి పనికి వస్తానని చెప్పిన కెమెరామెన్ ఆండ్ర్యూ, ఈ సినిమాకి వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన విషయం. నిర్మాత అర్జున్ దాస్యన్ గారితో కొంతమంది ఒక మాట అన్నారు. "మీ హీరో లాస్ట్ సినిమా ఆడింది కానీ చాలా రోజులైంది కదా, అలాంటప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయడం కరెక్టేనా? అని  అడిగారు. "నేను ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తాను .. ఒక మంచి సినిమాను తీశాననే నమ్మకం నాకు ఉంది" అని ఆయన అన్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందని నేను ఆశిస్తున్నాను.

మేఘ ఆకాశ్ విషయానికొస్తే నిజంగానే ఆ అమ్మాయి మహాలక్ష్మి .. ఫేస్ ఎంతో కళగా ఉంటుంది. ఆమె చాలా పరిణతితో వ్యవహరిస్తుంది. సమయానికి వచ్చి తన పని తాను చూసుకుని వెళుతుంది. తన పాత్రను తాను గొప్పగా చేసింది. సినిమా చూసిన తరువాత మీరు కూడా అదే మాట అంటారు. వర్మగారి సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకునేవాడిని. ఆయన నాకు ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఈ స్టేజ్ పై చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.       
Tags:    

Similar News