ట్వీట్లతో నాగబాబును కడిగేసిన వర్మ

Update: 2017-01-08 05:16 GMT
తోపుల్లాంటి రాజకీయ నాయకులు.. రౌడీలు.. మాఫియా డాన్ లు.. ఇలా వాళ్లేంటి.. వీళ్లేంటి చివరకు ప్రధాని మీదనైనా సరే మనసుకు అనిపించింది.. అనిపించినట్లుగా చెప్పే ప్రముఖ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా? అంటే చప్పున గుర్తుకొచ్చేది.. విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎవరితోనైనా పేచీ పెట్టుకోగలడు. ఎవరి పైనైనా ప్రేమ కురిపించగలడు. భయమన్నది అస్సలు లేకుండా.. వార్నింగ్ లను అస్సలు కేర్ చేయకుండా తనకు తోచింది.. తనకు అనిపించింది మొహమాటం లేకుండా చెప్పేసే వర్మకు భయం అన్నది అస్సలు తెలీదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

మొన్నటికి మొన్న వంగవీటి సినిమాను తీయటం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాపై వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసినా.. అస్సలు పట్టించుకోకుండా చాలా లైట్ గా తీసుకోవటమే కాదు.. రివర్స్ గేర్ లో అతనికే దిమ్మ తిరిగేలా ట్వీట్ చేసిన వర్మ భారీ షాకిచ్చారు. రంగా పాత్రను సినిమాలో డ్యామేజింగ్ గా చూపించారంటూ వర్మపై విరుచుకుపడిన రాధాకు.. నిజం చెప్పాలా? అంటూ చేసిన ట్వీట్ తో రాధా నోటి నుంచి మళ్లీ మాట అన్నదే రాలేదు. రాధా వార్నింగ్ కు ధీటుగా ఆర్జీవీ ట్వీట్లతో చేసిన ప్రతి వార్నింగ్ చూసిన వాళ్లకు ఆర్జీవీ ఎంతటి మొండోడో మరోసారి ఫ్రూవ్ అయ్యింది.

ఖైదీ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు విపరీతమైన ఆవేశానికి గురై.. వర్మను చెడామడా తిట్టేయటం.. అదే ఊపులో ప్రముఖ రచయిత యండమూరిని కడిగేయటం లాంటివి జరిగిపోయాయి. నాగబాబు చేసిన ఘాటైన వ్యాఖ్యలపై కాసేపటికే స్పందించిన వర్మ.. తనను అపార్థం చేసుకున్నారంటూ తన స్టైల్ కి భిన్నమైన రీతిలో రియాక్ట్ అయ్యారు. ‘మీకు.. మీ కుటుంబానికి సారీ’ అంటూ చెప్పారు. వర్మ లాంటోడు అంత హంబుల్ గా సారీ చెప్పేయటం వార్తాంశంగా మారింది. అదీ కాసేపే. వర్మ లాంటోడు మరీ అంతలా సారీ చెప్పేస్తారా? అన్న డౌట్ పడుతున్న వారు అనుకున్నట్లే తన వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు.

బహిరంగ సభలో తనపై విరుచుకు పడిన నాగబాబుపై వరుస ట్వీట్లతో భారీ మాటల యుద్ధాన్నే రేపాడు. ‘‘నాగబాబు సార్’’ అంటూ ప్రతి ట్వీట్ లోనూ కోట్ చేసిన వర్మ.. విమర్శల వర్షం కురిపించారు. ‘నాగబాబు సార్.. అక్కుపక్షులపై దృష్టి పెట్టి సమయం వృధా చేయటం కన్నా మీ సోదరులను ప్రసన్నం చేసుకోవటంపై దృష్టి పెడితే మంచిది. లేకుంటే తమరు రోడ్డుపై ఉండాల్సి  ఉంటుంది’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను డైరెక్టర్ గా ఉండటం వల్ల చాలా కుటుంబాలు తనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని.. కానీ నాగబాబు కెరీర్ కేవలం ఆయన సోదరుల కుటుంబాలపై ఆధారపడి సాగుతోందన్నారు. మీకు కావాలంటే ఇంతకన్నా ఎక్కువే ట్వీట్ చేయగలనని వార్నింగ్ ఇచ్చారు. నాగబాబు జబర్దస్త్ మీదా వ్యాఖ్యలు చేసిన వర్మ.. ఖైదీ ట్రైలర్ పైనా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘‘ఇప్పుడే ఖైదీ నంబరు 150 ట్రైలర్ చూశాను. అది అవతార్ సినిమా కన్నా చా.. లా అద్భుతంగా ఉంది’ అంటూ ఎంతలా ఎటకారం చేయాలో అంతలా ఎటకారం చేసి పారేశారు.  

చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీ పెట్టమని తప్పుడు సలహా ఇచ్చి ఆయన ఓటమికి కారణమయ్యారన్న విషయం రాష్ట్రమంతా తెలుసన్న వర్మ.. ‘‘నేనేం చేయాలో సలహా ఇచ్చే ముందు.. ఎలాంటి జీవం లేని మీ జబర్ధస్త్ కెరీర్ గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటూ నిలదీశారు. చిరుకి ఉన్న గొప్పతనంలో నాగబాబుకు 0.01 శాతం కూడా లేదన్న ఆయన.. ‘‘మీకు ఇంగ్లిష్ అర్థం కాదనుకుంటాను. ఎవరైనా చదువుకున్న వారితో నా ట్వీట్లను తెలుగులోకి అనుమాదం చేసి చదువుకోండి’’ అంటూ కాలిపోయే మాటల్ని మాట్లాడారు. అంతకు ముందు తన ట్వీట్ ఖాతాలో సారీ ట్వీట్ల గురించి ప్రస్తావిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో ఇడియట్ హ్యాక్ చేశారని.. తనకు తెలుగులో ట్వీట్లు చేసే అలవాటు లేదని చెప్పారు. ఓపెన్ గా ఇద్దరు సినీ ప్రముఖులు ఈ రేంజ్లోలో ఓపెన్ గా ఫైర్ కావటం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News