2008, నవంబర్ 26న తేదీ పేరు చెపితేనే ప్రతి ఒక్క భారతీయుడు గజగజ వణికిపోతాడు. 26/11 అంటేనే యావత్ భారతదేశంలో ఉన్న వారందరికి ముంబై మహానగరంపై ఉగ్రవాదులు చేసిన దాడులు గుర్తుకు వస్తాయి. ఈ స్టోరీని బేస్ చేసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ 'ది అటాక్స్ ఆఫ్ 26/11' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వర్మ ఆయన స్వీయదర్శకత్వంలోనే నిర్మించారు. తాజాగా వర్మ 26/11 మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆ దారుణమరణ హోమం ఆధారంగా తీసిన 26/11 సినిమాలోని పలు సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సినిమాలో ఓ సన్నివేశం తన జీవితంలోనే హైలెట్ అని ...తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలోను ఆ సీన్ అత్యుత్తమమైందిగా వర్మ అభివర్ణించారు. వర్మకే అంతలా నచ్చేసిన ఆ సీన్ ఏంటంటే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన నానా పటేకర్ ఉగ్రవాదులపై దాడుల అనంతరం సజీవంగా పట్టుకున్న కసబ్ ను మృతి చెందిన తన తోటి ఉగ్రవాదుల డెడ్ బాడీస్ వద్దకు తీసుకువెళతాడు. అప్పుడు కసబ్ కు నానా పటేకర్ వేసే ప్రశ్నలు సినిమా చూసిన ప్రేక్షకుడికి ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఆ సీన్ లో పోలీస్ ఆఫీసర్ గా నానా పటేకర్ ఎంతో ఒదిగిపోయారని...అక్కడ ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాలు ఎంతో సహజంగా వచ్చాయని వర్మ పేర్కొన్నారు.
నానా పటేకర్ నటించిన ఈ సన్నివేశం తన జీవితంలోనే అత్యుత్తమ సన్నివేశంగా నిలిచిపోయిందంటూ...వర్మ నానా పటేకర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ లో వెల్లడించాడు. 2008, నవంబర్ 26న పాకిస్తాన్ కు చెందిన 10 మంది టెర్రరిస్టులు సముద్ర మార్గం ద్వారా ముంబై మహానగరంలోకి ప్రవేశించి తాజ్ హోటల్ తో పాటు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దారుణ మరణహోమం సృష్టించారు. ఈ కాల్పుల్లో 166 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ దాడుల్లో కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే.