#KRKR: బాల‌య్య‌- ఎన్టీఆర్ లేక‌పోతే ఎలా ఆర్జీవీ?

Update: 2019-11-27 12:50 GMT
ఆర్జీవీ తెర‌కెక్కించిన `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` ఈనెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి ఇప్ప‌టివ‌ర‌కూ సెన్సార్ పూర్త‌వ్వ‌క‌పోవ‌డంతో అస‌లు రిలీజ‌వుతుందా అవ్వ‌దా? అన్న డైలమా అభిమానుల్లో నెల‌కొంది. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన ఆర్జీవీ కోర్టు గొడ‌వ‌లు సెన్సార్ వ్య‌వ‌హారాలు స‌హా ఈ చిత్రంలో ప‌ప్పు క్యారెక్ట‌ర్ పైనా.. ప‌లు కీల‌క అంశాల‌పైనా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు సమాధాన‌మిచ్చారు.

క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు చిత్రం పొలిటిక‌ల్ సెటైర్ మూవీ. ఏదో ఒక కులాన్ని లేదా ఒక వ్య‌క్తిని కించ‌ప‌రిచేలా ఈ సినిమాని తీయ‌లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా అలా భావిస్తే లార్డ్ బాలాజీనే న‌న్ను శిక్షిస్తాడు అని వ‌ర్మ అన్నారు. ఈ చిత్రంలో ప‌ప్పు సీన్ గురించి ప్ర‌శ్నిస్తే .. ఆ స‌న్నివేశాన్ని టీడీపీ నాయ‌కులు  ఫుల్ గా ఎంజాయ్ చేస్తార‌ని.. నేను కేవ‌లం కొడుకు ప్లేట్ లో పప్పు వ‌డ్డించే తండ్రి (చంద్ర‌బాబు) ని మాత్ర‌మే చూపించాన‌ని కానీ మీడియానే పేర్ల‌తో స‌హా హైలైట్ చేస్తోంద‌ని త‌న‌దైన శైలిలో అన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొడుకుపై తండ్రి ప్రేమ‌ను మాత్ర‌మే చూపించాన‌ని ఆర్జీవీ మీడియాపైకే నెపం నెట్టేశారు. ఇందులో బాల‌య్య‌- ఎన్టీఆర్ పాత్ర‌ల్ని చూపిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు ఆర్జీవీ స‌మాధానం ఇచ్చారు. ``ఆ ఇద్ద‌రి పాత్ర‌లు ఇందులో లేవు. సొంత పార్టీ పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఒక హీరో పాత్ర‌ను చూపిస్తున్నాను. మ‌న‌సేన అనేది పార్టీ పేరు`` అంటూ ప‌వ‌న్ రోల్ గురించి వెల్ల‌డించారు.

అయితే మ‌రో రెండ్రోజుల్లోనే రిలీజ్ కి రానున్న ఈ సినిమాకి ఇప్ప‌టివ‌ర‌కూ సెన్సార్ స‌ర్టిఫికెట్ రాక‌పోవ‌డంతో చెప్పిన టైమ్ కి రిలీజ‌వుతుందా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. ఇక కోర్టుకు ఈ సినిమాని చూపిస్తారా? అంటే.. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్త‌యితే కోర్టులో న్యాయ‌మూర్తుల‌కు చూపించే వీలుంద‌ని భావిస్తున్నారు.


Tags:    

Similar News