లోఫర్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు

Update: 2015-12-17 11:25 GMT
పూరీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ రిలీజ్ అయింది. పూరీకి బాగా అలవాటైన, ఇప్పటికే చాలాసార్లు తీసేసిన జోనర్ అయినా.. పూరీ మార్క్ మూవీ కావడంతో కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రిపోర్టే వస్తోంది. రొటీన్ మాస్ మసాలా అయినా.. ఈ మూవీకి ఉన్న లోటు ఎంటర్ టెయిన్ మెంట్ ఒకటే అనే మాట వినిపిస్తోంది.

కానీ పూరీ జగన్నాధ్ గురువు రామ్ గోపాల్ వర్మకు మాత్రం లోఫర్ పిచ్చపిచ్చగా నచ్చేసిందట. లోఫర్ చూసొచ్చిన వెంటనే ఆ మూవీని, కాస్టింగ్ ని, డైరెక్టర్ ని పొగిడేస్తూ.. ట్విట్టర్ లో ఓ అరడజన్ ట్వీట్స్ చేసేశాడు. "మ్యూజిక్ - డ్రామా - యాక్షన్ సమపాళ్లలో మిక్స్ అయిన మూవీ లోఫర్. ముకుంద - కంచెల నుంచి వరుణ్ తేజ్ లో ఇంత స్పీడ్ గా మార్పు రావడం చిన్న విషం కాదు. ఈ కుర్రాడి స్పీడ్ చూస్తుంటే కాబోయే మెగాస్టార్ ఇతనే అనిపిస్తోంది. రేవతి - పోసానిల కేరక్టర్లయితే టెరిఫిక్, సునీల్ కశ్యప్ మ్యూజిక్ కూడా అంతే" అన్నాడు వర్మ.

అంతేకాదు. "గత కొన్నేళ్లుగా నేను చూసిన హీరోయిన్లలో దిశా పటాని యే బెస్ట్. లోఫర్ లో చేసిన కేరక్టర్ కి ఉన్న పరిధి కారణంగా ఆమె తన ట్యాలెంట్ ని పూర్తిగా చూపించే అవకాశం లేదు. ఇక వరుణ్ తేజ్ కేరక్టర్ ని పూరీ డిజైన్ చేసిన తీరు చూస్తుంటే.. ఇతర మెగా ఫ్యామిలీ హీరోల కంటే ఎక్కువ స్టార్ డం సంపాదించుకోవడం ఖాయం " అంటూ సినిమాని, టీంని ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. సాధారణంగా నెగిటివ్ పాయింట్స్ తో విరుచుకుపడే వర్మ.. తన శిష్యుడి సినిమా కావడంతో.. తన వంతుగా ఆన్ లైన్ ప్రచారం చేసి పెడుతున్నాడు.
Tags:    

Similar News