కొత్త సినిమాలు చేయనంటే చేయనంటున్నాడు

Update: 2015-09-27 11:30 GMT
తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు ఆడవని గట్టి నమ్మకంతో ఉంటారు సినీ జనాలు. హీరో రామ్‌ కు కూడా అలాంటి నమ్మకమే ఉన్నట్లుంది. తన కెరీర్ లో కొంచెం కొత్తగా ట్రై చేసిన సినిమాలన్నీ దారుణమైన దెబ్బలు కొట్టాయని.. ఇకపై తాను ఆ టైపు సినిమాల్లో నటించనని చెప్పకనే చెప్పేశాడు రామ్.

‘‘నేను చేసిన ప్రయోగాలన్నీ నన్ను తీవ్రంగా నిరాశ పరిచాయి. నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను ఎలాంటి సినిమాలు చేయాలో స్పష్టంగా తెలిసొచ్చింది. కొన్ని సినిమాల్ని ఎంతో ఇష్టపడి - కష్టపడి చేశా. కానీ ఆ సినిమాలు దారుణమైన ఫలితాల్నిచ్చాయి. జగడం - గణేష్ - ఎందుకంటే ప్రేమంట - ఒంగోలు గిత్త - మసాలా.. ఇవన్నీ నేను కొత్తదనం కోసం చేసిన సినిమాలు. కానీ అవన్నీ పెద్ద ఫ్లాపులుగా మిగిలాయి. జగడం సినిమా కోసం నేను రెండేళ్ల పాటు కష్టపడ్డాను. గణేష్ సినిమా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇష్టపడి చేశాను. మసాలా సినిమాలో గే క్యారెక్టర్ చేయడానికి వెనుకాడలేదు. కానీ ప్రేక్షకులకు ఈ సినిమాలేవీ నచ్చలేదు. ఎందుకో నాకు తెలియదు. అందుకే నేను ఎలాంటి సినిమాలు చేస్తే జనాలకు నచ్చుతుందో అలాంటివి చేస్తున్నా’’ అన్నాడు రామ్.

‘పండగ చేస్కో’ రొటీన్ సినిమా అన్న కామెంట్స్ వినిపించినా.. ఆ సినిమా బాగా ఆడేసరికి ఇకపై రొటీన్ సినిమాలే చేయాలని గట్టిగా ఫిక్సయినట్లున్నాడు రామ్. ‘శివమ్’ ట్రైలర్ చూసినపుడే అందులో ఏ కొత్తదనం లేదని అర్థమైంది. వచ్చే శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూద్దాం.. అది ఎంత రొటీన్ గా ఉందో, ఆ సినిమా రామ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో?
Tags:    

Similar News