ఎక్క‌డ నెగ్గాలో.. ఎక్క‌డ త‌గ్గాలో రామ్ తెలుసుకున్నాడా?

Update: 2022-06-10 17:30 GMT
యంగ్ హీరో ఉస్తాద్ రామ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. వీరిద్ద‌రి తొలి కాంబినేష‌న్ లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి రామ్ కెరీర్ లోనే భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా రికార్డు సాధించింది. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ తో రామ్ త‌న పారితోషికాన్ని పెంచుతూ పోతున్నారు. అయితే ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో కూడా త‌న‌కు తెలుసు అంటూ రామ్ తాజా సినిమా విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

వివ‌రాల్లోకి వెళితే.. హీరో రామ్ ప్ర‌స్తుతం త‌మిళ యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి డైరెక్ష‌న్ లో చేస్తున్న మూవీ 'ది వారియ‌ర్‌'. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్టోరీ నేప‌థ్యంలో ఈ మూవీని హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వల్ గా ఏక కాలంలో తెర‌కెక్కిస్తున్నారు. జూలై 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో క‌న్న‌డ న‌టి అక్ష‌ర గౌడ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. హీరో ఆది పినిశెట్టి ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా న‌టిస్తున్నారు. త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా, న‌దియా, 'క్రాక్‌'ఫేమ్ చిరాగ్ జైన్‌, బ్ర‌హ్మాజీ ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ కోసం 10 కోట్ల‌కు పైనే హీరో రామ్ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. 'ఇస్మార్ట్ శంక‌ర్‌' బ్లాక్ బ‌స్ట‌ర్ కార‌ణంగా త‌న రేంజ్ పెరిగిపోవ‌డంతో రామ్ ఈ స్థాయిలో త‌న పారితోషికాన్ని పెంచేశారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే 'ది వారియ‌ర్‌' మూవీ కోసం భారీ స్థాయిలో పారితోషికాన్ని పెంచేసిన రామ్ త‌దుప‌రి చిత్రానికి మాత్రం భారీ స్థాయిలో త‌గ్గించుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి డైరెక్ష‌న్ లో చేస్తున్న బైలింగ్వ‌ల్ మూవీ 'ది వారియ‌ర్‌' కోసం 10 కోట్ల‌కు మించి రెమ్యున‌రేష‌న్ ని తీసుకున్న రామ్ త‌న 20వ సినిమాకు మాత్రం స‌గానికి స‌గం త‌గ్గించేయ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

'ది వారియ‌ర్‌' మూవీ త‌రువాత రామ్ స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీకి ముందు 15 కోట్ల వ‌ర‌కు పారితోషికం డిమాండ్ చేసినా ఫైన‌ల్ గా 7 కోట్ల‌తో రామ్ స‌రిపెట్టుకుంటున్నార‌ట‌. అంటే దాదాపు 7 కోట్లు త‌గ్గించుకున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కూడా ముందు భారీగానే అడిగినా ఫైన‌ల్ గా 8 కోట్ల‌తో స‌రిపెట్టుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రెమ్యున‌రేష‌న్ ని స‌డ‌న్ గా త‌గ్గించుకోవ‌డానికి కార‌ణం సినిమా లాభాల్లో వాటాలు తీసుకోవ‌డానికి ఒప్పందం కుదుర్చుకోవ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు, హీరో ఇద్ద‌రూ సినిమా కు వ‌చ్చిన లాభాల్లో 25 శాతం తీసుకోవాల‌న్న ఒప్పందం ప్ర‌కారం త‌మ రెమ్యున‌రేష‌న్స్ ని స‌గానికి స‌గం త‌గ్గించుకుని ఈ సినిమా చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఈ విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో ఎక్క‌డ నెగ్గాలో కాదు ఎక్క‌డ త‌గ్గాలో కూడా రామ్ తెలుసుకున్నాడా? అని ప‌లువురు కామెంట్ లు చేస్తున్నారట‌.
Tags:    

Similar News