మూవీ రివ్యూ : శివం

Update: 2015-10-02 09:52 GMT
‘శివమ్’ రివ్యూ
నటీనటులు- రామ్ - రాశి ఖన్నా - వినీత్ కుమార్ - అభిమన్యు సింగ్ - బ్రహ్మానందం - పోసాని కృష్ణమురళి - శ్రీనివాసరెడ్డి - రాజేష్ - సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం- రసూల్ ఎల్లోర్
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
మాటలు- కిషోర్  తిరుమల
నిర్మాత- స్రవంతి రవికిషోర్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం- శ్రీనివాసరెడ్డి

స్రవంతి మూవీస్ సంస్థది టాలీవుడ్ లో 30 ఏళ్ల ప్రస్థానం. ఈమైలురాయికి గుర్తుగా వచ్చిన సినిమా ‘శివమ్’. లేడీస్ టైలర్ దగ్గర్నుంచి విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తూ, అద్భుతమైన విజయాలందుకుంటూ ఈ స్థాయికి వచ్చిన స్రవంతి సంస్థ నుంచి ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాను ఆశిస్తాం. మరి ఆ ఆశల్ని ‘శివమ్’ నెరవేర్చిందో లేదో చూద్దాం పదండి.

కథ:

శివ (రామ్) పెద్దల అభ్యంతరాల వల్ల ఒక్కటి కాలేకపోతున్న ప్రేమ జంటల్ని కలపడమే పనిగా పెట్టుకున్న కుర్రాడు. ఈ విషయంలో ఎంత రిస్క్ ఎదురైనా పట్టించుకోడు. వందకు పైగా జంటల్ని కలిపి శివ.. తనకు అనుకోకుండా ఐలవ్యూ చెప్పిన తనూజ (రాశి ఖన్నా)తో ప్రేమలో పడిపోతాడు. శివ ఆ అమ్మాయి వెంట తిరుగుతుంటే.. ఓ చిన్న గొడవలో తన కొడుకును కొట్టిన శివను పట్టుకునేందుకు భోజి రెడ్డి (వినీత్ కుమార్) బ్యాచ్ తిరుగుతుంటుంది. మరోవైపు తనూజను ప్రేమించిన అభి (అభిమన్యు సింగ్) కూడా ఆమె కోసం వెతుకుతుంటాడు. ఇంతలో భోజి రెడ్డి మనుషులు శివను - అభి.. తనూజను పట్టుకుంటారు. మరి భోజి రెడ్డి నుంచి తాను తప్పించుకుని.. అభి నుంచి తనూజను తప్పించి.. చివరికి ఆమెను శివ ఎలా సొంతం చేసుకున్నాడు? అతను రిస్క్ చేసి మరీ ప్రేమజంటల్ని ఎందుకు కాపాడతాడు? దానికి కారణమేంటి? అన్నది తెరమీద తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

తాను కొత్తగా ట్రై చేసిన ప్రతి సినిమా బోల్తా కొట్టేసిందని.. అందుకే రొటీన్ సినిమాలు చేస్తున్నానని ఈ మధ్య సెలవిచ్చాడు రామ్. కానీ రామ్ కొత్తగా ట్రై చేయడం వల్లే ఆ సినిమాలు బోల్తా కొట్టాయా.. లేక ఇంకేవైనా లోపాల వల్ల అవి ఆడలేదా అన్నది ప్రశ్న. ఏదో రొటీన్ గా ట్రై చేసిన ‘పండగ చేస్కో’ ఓ మాదిరిగా ఆడేసినంత మాత్రాన.. మరీ ఇంత రొటీన్, లాజిక్ లెస్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడమే విడ్డూరం.

హీరో ట్రైన్ లో వెళ్తుంటాడు.. ఓ స్టేషన్ లో బండి ఆగితే.. బయటికొచ్చి సిగరెట్టు కొని నోట్లో పెడతాడు. విలన్ గ్యాంగులో ఒకడొచ్చి లైటర్ లాక్కుంటాడు. హీరోకు రక్తం ఉడికిపోతుంది. అంత చిన్న గ్యాప్ లోనే విలన్ని - అతడి గ్యాంగుని ఉతికారేసి ట్రైన్ ఎక్కేస్తాడు. ఇక అక్కణ్నుంచి విలన్ గ్యాంగు హీరో కోసం తిరుగుడే తిరుగుడు.

ఇక హీరో గారి లవ్ స్టోరీ చూద్దాం. విలన్ని బాదేసి బండి ఎక్కేసిన హీరో అలా డోర్ దగ్గర నిలబడి చల్లగాలి పీలుస్తుండగా దూరంగా హీరోయిన్ పూలతోటలో ఏదో డ్రామా కోసం రిహార్సల్స్ చేస్తూ, హీరోను చూస్తూ ఐలవ్యూ అనేస్తుంది. స్పీడుగా వెళ్తున్న ట్రైన్ లోంచి ఆ మాట వినేసిన.. ఫుల్ ఫీలింగ్ తెచ్చేసుకుని బండిలోంచి కిందికి దూకేస్తాడు. హీరోయిన్ వెంట హీరో తిరుగుడే తిరుగుడు.

ఈ ట్రైన్ లవ్ ట్రాక్ కు సంబంధించి ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. హీరోయిన్ ఐలవ్యూ అంటుండగా పక్క బోగీ లోంచి ఇంకో విలన్ అది వింటాడు. ఆమె ఐలవ్యూ చెబుతోంది తనకే అనుకుంటాడు. కానీ ఆమె హీరోను చూసి ఆ మాట అంటోందని ఫీలైపోయి.. హీరో మీద పగబట్టేస్తాడు. హీరో కూడా ఈ విలన్ కూడా తిరుగుడే తిరుగుడు.

కొన్నిసార్లు లాజిక్కులు వదిలేయొచ్చు.. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు.. కానీ మరీ ఇంతగా హద్దులు దాటిపోతే ఎలా? ఓ కొత్త దర్శకుడు మరీ ఇంత రొటీన్ సినిమా తీయడమే ఆశ్చర్యమైతే.. మరీ లాజిక్ అన్న మాటే పట్టించుకోకపోవడం.. స్రవంతి మూవీస్ లాంటి పెద్ద సంస్థ ఏమీ అభ్యంతర పెట్టేయకుండా కోట్లు పోసేయడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. రొటీన్ సినిమాల్ని- లాజిక్ లేని సినిమాల్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఐతే ఈ లోపాల్ని పట్టించుకోకుండా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ మెంట్ మత్తులో ముంచెత్తే మ్యాజిక్ కథనంలో ఉండాలి. ‘శివమ్’ సినిమాలో అదే మిస్సయింది.

విషయం లేని ఒక రొటీన్ కథను చెప్పదలుచుకున్నపుడు దాన్ని సాధ్యమైనంత తక్కువ నిడివిలో ముగించడానికి ప్రయత్నించాలి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులైనా ఉండేలా చూసుకోవాలి. కానీ చెప్పుకోదగ్గ మలుపులేమీ లేకుండా.. ఇలాంటి రొటీన్ కథాకథనాలతో రెండు ముప్పావు గంటల పాటు సినిమాను సాగదీయడం దర్శకుడు చేసిన అతి పెద్ద తప్పిదం.

రామ్ తన ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడానికి బాగానే ప్రయత్నించాడు. రాశి  ఖన్నా గ్లామర్ ప్రియులకు వల బాగానే విసిరింది. పాటల్ని చాలా రిచ్ లొకేషన్స్ లో అందంగా తెరకెక్కించారు. కొన్ని చోట్ల కామెడీ కూడా వర్కవుటైంది. కానీ ప్లస్సులన్నీ గోరంత అయితే.. సినిమాలోని మైనస్సులు కొండంత. ఆ మైనస్ ల ముందు ప్లస్సులు నథింగ్.

స్రవంతి రవికిషోర్ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో భిన్నమైన సినిమాలు తీశారు. అద్భుతమైన విజయాలందుకున్నారు. మరి 20 - 30 ఏళ్ల ముందే అంత భిన్నమైన సినిమాలు తీసిన ఆయన.. ఇప్పుడు 30 ఏళ్ల ఘనమైన ప్రస్థానానికి గుర్తుగా ఇలాంటి సినిమాను అందించడమే బాధ కలిగించే విషయం.

నటీనటులు:

రామ్ పెర్ఫామెన్స్ ఓకే. ఎప్పట్లాగే కాన్ఫిడెంటుగా నటించాడు. పాటలు - ఫైట్ ల విషయంలో చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ ను డామినేట్ చేసే  గ్లామర్ తో - స్టైలింగ్ తో ఆకట్టుకున్నాడు. కానీ కొన్ని చోట్ల అవసరానికి మించి కాన్ఫిడెన్స్ చూపించాడు. రామ్ ఫిజిక్ కి - అతడు చేసే ఫైట్లకు మ్యాచ్ కావట్లేదన్న విషయాన్ని అతను గుర్తిస్తే బెటర్. రాశి ఖన్నా పెర్ఫామెన్స్ పరంగా ఏమీ చేసింది లేదు కానీ.. చాలా గ్లామరస్ గా కనిపించింది. విలన్ లు వినీత్ కుమార్ (విక్రమార్కుడు ఫేమ్), అభిమన్యు సింగ్ పెద్దగా చేసిందేమీ లేదు. శకునాల్ని నమ్మే అభిమన్యు పాత్ర ఆరంభంలో బాగానే అనిపిస్తుంది కానీ.. తర్వాత విసుగెత్తిస్తుంది. సప్తగిరి పాత్ర మెరుపులా వచ్చి.. ఏ ముద్రా వేయకుండా అంతర్ధానమైపోయింది. బ్రహ్మానందం కామెడీ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. అది వేస్ట్ క్యారెక్టర్. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. రొటీన్  సినిమా కదా దేవి కూడా చాలా రొటీన్ గా పని కానిచ్చేశాడు. ఒకట్రెండు పాటలు వినబుద్ధేస్తాయి. రెండు పాటలు డ్యాన్సులకు పనికొచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరీ రొటీన్ గా అనిపిస్తుంది. రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం సినిమాలో అన్నిటికంటే పెద్ద విశేషం. కలర్ ఫుల్ సినిమాటోగ్రఫీతో సినిమాకు ఓ కళ తెచ్చాడు రసూల్. ముఖ్యంగా పాటల్లో అతడి పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఏమీ ఢోకా లేదు. ‘స్రవంతి’ పేరుకు తగ్గట్లు సినిమా రిచ్ గా తెరకెక్కింది. ‘కొత్త’ దర్శకుడు శ్రీనివాసరెడ్డి.. సినిమాలో ఎక్కడా ‘కొత్తదనం’ లేకుండా బాగా జాగ్రత్త పడ్డాడు. ఓ కొత్త దర్శకుడి నుంచి ఆశించే సినిమా కాదిది. శ్రీనివాసరెడ్డికి కమర్షియల్ సినిమాలు తీయగల సత్తా ఉందని కొన్ని చోట్ల అర్థమవుతుంది కానీ.. మరీ ఇలాంటి రొటీన్ కథాకథనాలతో బండి లాగించడమంటే కష్టమని అతను తెలుసుకోవాలి.

చివరిగా:   పరమ రొటీన్ ‘శివమ్’తో ప్రయాణం కష్టం.

రేటింగ్: 2/5

#Shivam, #ShivamMovie, #RamShivam, #Shivamreview, #ShivamMoviereview, #RamshivamReview, #ShivamRating, #ShivamTalk,



Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre
Tags:    

Similar News