కేంద్ర‌మంత్రికి షేవింగ్ చేసిన యువ న‌టుడు

Update: 2020-04-12 17:30 GMT
ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ కొన‌సాగుతుండ‌డంతో ప్ర‌జ‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు - సినీ - వ్యాపార‌ - క్రీడా ప్ర‌ముఖులందూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రికొన్నాళ్ల పాటు కూడా లాక్‌ డౌన్ కొన‌సాగుతుండ‌డంతో వారంతా పూర్తిగా వ్య‌క్తిగ‌త ప‌నుల్లో మునిగిపోయారు. ఈ సంద‌ర్భంగా ఒక్కొక్క‌రు తమ‌కు తోచిన విధంగా ఇంట్లో కాల‌క్షేపం చేస్తున్నారు. కొంద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన ప‌నులు చేసుకుంటూ జాలీగా గ‌డిపేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ న‌టుడు కేంద్ర మంత్రికి స‌ర‌దాగా షేవింగ్ చేస్తూ క‌నిపించాడు. ఈ విష‌యాన్ని అత‌డే ట్విట‌ర్‌ లో పంచుకున్నాడు.

రాజకీయ కుటుంబం నుంచి సినీ తెరకు పరిచయమైన న‌టుడు చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ త‌న‌యుడు. ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. అయితే లాక్‌ డౌన్ నేప‌థ్యంలో అన్ని దుకాణాల‌తో పాటు సెలూన్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో అత‌డి తండ్రికి గ‌డ్డం - త‌ల వెంట్రుక‌లు పెర‌గ‌డంతో త‌న‌యుడు నాయి బ్రాహ్మ‌ణుడి అవ‌తారం ఎత్తాడు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి రాంవిలాస్‌ కు షేవింగ్ - కటింగ్ చేశాడు.

ఈ సంద‌ర్భంగా దానికి సంబంధించిన వీడియో ట్విట‌ర్‌ లో పోస్టు చేస్తూ చిరాగ్ పాశ్వాన్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. గృహ నిర్బంధం కష్టమే కానీ లాక్‌ డౌన్‌ చాలా కష్టకాలంగా అనిపించినా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడింది. ఇంటి సభ్యులకు ఎలాంటి ప్రతిభ ఉందో.. ఏ విషయాల్లో నైపుణ్యం ఉందో తెలుసుకొనే అవకాశం దక్కింది. కరోనావైరస్ మాకు అందమైన అనుభూతులను పంచుతున్నది అని తెలిపాడు.

ఇలాంటి సమయంలో తండ్రితో సంపూర్ణంగా గడిపే అవకాశం దక్కింది. నా తండ్రి నుంచి చాలా విషయాలు తెలుసుకొనే ఛాన్స్ - అలాగే ఆయన అనుభవాలను పంచుకొనే అవకాశం కలిగింది అని యువ న‌టుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. తండ్రీత‌న‌యుల అనుబంధాన్ని కొనియాడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News