భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో తెలుగు వీరుడిగా అల్లూరి సీతారామరాజుకు ఉన్న గుర్తింపు ఎంతో గొప్పది. మన్యం వీరుడిగా ఆయన సాహసాలు నేటితరానికి స్ఫూర్తిదాయకం. తుపాకులు బాంబులు గ్రనేడ్ లతో విరుచుకుపడే అరాచక ఆంగ్లేయుల కుత్తుకలు కోసి బాణాలతో హతమార్చిన వీరత్వం చారిత్రాత్మకం.
అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 7 )ఒక మహోజ్వల శక్తి. ... సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కోసం తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు- నిరుపేదలు- అమాయకులు అయిన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
అంత గొప్ప వీరుడిగా నటించేందుకు వెటరన్ స్టార్లు ఒకరితో ఒకరు పోటీపడేవారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు సరిరారు అని నిరూపణ అయ్యింది. ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ ఆహార్యం ఎప్పటికీ మరువలేనిది. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు (1974) చిత్రం క్లాసికల్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 1957లోనే నవరసనటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ అల్లూరి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాతా అగ్ర హీరోలు అల్లూరిగా కనిపించినా సూపర్ స్టార్ కృష్ణ పేరు సినిమా హిస్టరీలో సుస్థిరంగా నిలిచిపోయింది.
నేటితరంలో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటించడం యువతరంలో ఆసక్తిని కలిగిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి అతడి వేషధారణను తీర్చిదిద్దిన తీరు నభూతోనభవిష్యతి అన్న తీరుగా కుదిరింది. చరణ్ స్వతహాగానే అథ్లెటిక్ లుక్ తో భుజబల బాహుబల పరాక్రముడిగా మేకోవర్ చూపించడం ఈ గెటప్ కి బాగా ప్లస్ అయ్యింది. వీరుడు అంటే ఇలా ఉండాలి! అనేంతగా ఆ పాత్రలోకి చరణ్ ఒదిగిపోయి కనిపిస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో చరణ్ బాణాల్ని సంధిస్తున్న తీరు అగ్గి బరాటానే తలపించింది. తాజా ఫోటోగ్రాఫ్ లో బాణం విల్లంబులు ధరించి ఒక చేత్తో గన్ పట్టుకుని కనిపిస్తున్నాడు చరణ్.
ఇక వెండితెరపై పూర్తి నిడివి పాత్రలో చరణ్ ఏమేరకు మ్యాజిక్ చేస్తాడు? అన్నది వేచి చూడాలి. నేడు సల్మాన్ అతిథిగా ముంబైలో ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఆర్.ఆర్.ఆర్ జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి చరణ్ .. తారక్ లకు విషెస్ తెలియజేసారు.