‘బాహుబలి’గా హృతిక్.. రానాకు కోపమొచ్చింది

Update: 2017-05-15 08:51 GMT
'బాహుబలి’ పాత్ర ప్రభాస్ కోసమే తయారు చేసిందని రాజమౌళి ఇంతకుముందే చెప్పాడు. మిగతా పాత్రల్ని ముందు రాశాక అందుకు తగ్గ నటీనటుల్ని ఎంచుకుంటే.. ‘బాహుబలి’ పాత్ర ఒక్కదాన్నే ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దామని రాజమౌళి వెల్లడించాడు. ఐతే ఓ నేషనల్ డైలీ మాత్రం ‘బాహుబలి’ పాత్రకు ముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ను సంప్రదించారని.. అతను కాదన్నాకే ప్రభాస్‌ను అడిగారని ఒక కథనం ప్రచురించింది.

దీనిపై ‘బాహుబలి’ విలన్ రానా దగ్గుబాటికి కోపం వచ్చింది. ఈ కథనంపై అతను స్పందించాడు. ఇది అర్థరహితమైన వార్త అని.. ‘బాహుబలి’కి ఫస్ట్ ఛాయిస్ ప్రభాసే అని.. ఆ పాత్రకు అతను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రానా అన్నాడు. ప్రభాస్ మీద రానా విపరీతమైన ప్రేమను కురిపిస్తూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

ప్రభాస్‌ను పొగిడే విషయంలో రానా అసలే మొహమాటాలు పెట్టుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే బాహుబలిగా హృతిక్.. అనే వార్తపై వెంటనే రెస్పాండయ్యాడు. ‘బాహుబలి’ శ్రీకారం చుట్టుకున్నది తెలుగులో. ఐతే బడ్జెట్ కొంచెం హద్దులు దాటేలా ఉండటంతో హిందీలో కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచన తర్వాత వచ్చింది. అలాంటిది ఈ సినిమాను హృతిక్ హీరోగా ఎందుకు తీయాలనుకుంటాడు రాజమౌళి. ఇది అచ్చంగా గాలి వార్త అనడంలో సందేహమే లేదు.
Tags:    

Similar News