నేనా.. డ్రగ్సా.. అన్న స్టార్ హీరో

Update: 2017-07-18 11:38 GMT
వారం రోజుల నుంచి డ్రగ్స్ కుంభకోణం టాలీవుడ్‌ ను కుదిపేస్తూ ఉంది. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్.. రవితేజ లాంటి స్టార్ హీరోల పేర్లు కూడా ఈ కేసులో బయటికి వచ్చాయి. వారికి నోటీసులు కూడా వెళ్లాయి. త్వరలోనే వారిని పోలీసులు విచారించనున్నారు కూడా. మరోవైపు ఈ కుంభకోణంలో మరిందరు ప్రముఖుల పాత్ర ఉందని.. వాళ్ల పేర్లను పోలీసులు తొక్కి పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు కొడుకైన రానా కు కూడా డ్రగ్ రాకెట్లో పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చాడు. ఐతే ఇప్పుడు రానా స్వయంగా ఈ విషయమై మీడియాతో మాట్లాడాడు.

తాను డ్రగ్స్ తీసుకునే ప్రసక్తే లేదని రానా స్పష్టం చేశాడు. ‘‘నేను రోజుకు 20 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాను. జిమ్‌ లోనూ చాలా కష్టపడతాను. చాలా సమయం ఫిజిక్ కోసమే కేటాయిస్తాను. ఇప్పుడు నేనున్న షేప్‌ లోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో అందరికీ తెలుసు. డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌ గా ఉంటానో నాతో పని చేసిన వాళ్లకు తెలుసు. బాడీ విషయంలో అంత శ్రద్ధ పెట్టే నేను డ్రగ్స్ ఎలా తీసుకుంటాను. అవి తీసుకుంటే నేనిలా ఉంటానా’’ అని ఒక నేషనల్ ఇంగ్లిష్ డైలీతో వ్యాఖ్యానించాడు రానా. తన గురించి.. తన కుటుంబ సభ్యుల గురించి ఇంతకుముందు కూడా కొన్ని రూమర్లు వచ్చాయని.. ఐతే ఇలాంటి వాటిని లైట్ తీసుకోవడం తనకు అలవాటైపోయిందని.. ఇప్పుడు వచ్చిన ఆరోపణల్ని కూడా తాను తేలిగ్గానే తీసుకున్నానని రానా తెలిపాడు.
Tags:    

Similar News